వెస్టిండీస్ జట్టులో నైపుణ్యం ఉన్నా ముందుండి నడిపించే సరైన నాయకుడు లేడు. అందుకే కొన్ని నెలలుగా ఆ జట్టు సరైన ప్రదర్శన చేయడంలో విఫలమైంది. ఎక్కువ మంది ఆటగాళ్లు జాతీయ జట్టుకు ఆడడం కంటే ప్రపంచ వ్యాప్తంగా లీగ్‌ల్లోనే ఆడడంపైనే ఆసక్తి చూపిస్తున్నారు. అందుకే ఆ దేశ క్రికెట్లో ప్రమాణాలు పడిపోయాయి. చివరికి చిన్నజట్టు అఫ్గానిస్థాన్ చేతిలో టీ20 సిరీస్‌లో పరాజయం చవిచూసేంతగా పరిస్థితులు దిగజారాయి.
ఇలాంటి సమయంలో సొంతగడ్డపై భారత్ లాంటి బలమైన జట్టుతో మ్యాచ్‌లు అంటే.. విండీస్ కనీసం పోటీ ఇస్తుందా అని అంతా భావించారు. కానీ ఊహించని రీతిలో సీనియర్ క్రికెటర్ పొలార్డ్ నాయకత్వంలోని కరీబియన్ జట్టు.. కోహ్లీసేనకు గట్టిపోటీనిచ్చింది. ఓటమిని అంత తేలిగ్గా ఒప్పుకోలేదు. వన్డే, టీ20ల్లో మజానిస్తూ పోరాడి ఓడిపోయింది విండీస్.
పొలార్డ్ పగ్గాలందుకున్నాక వెస్టిండీస్ జట్టు తీరులో మార్పు వచ్చింది. ఒకప్పటి విండీస్‌తో పోల్చేంత కాకపోయినా...ృ ఇటీవల కాలంలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చింది. అప్పటిలా ఆటగాళ్లలో భయంలేని ఆట కనిపిస్తోంది. దూకుడైన ఇన్నింగ్స్ దర్శనమిస్తున్నాయి. ఆఖరి వరకు ఓటమిని అంగీకరించని తత్వం పెరుగుతోంది.
భారత పర్యటనలో వెస్టిండీస్ ఆరు మ్యాచ్‌లు (టీ20లు, వన్డేలు) ఆడితే అన్నింట్లో అదరగొట్టింది. రెండు సిరీస్‌ల్లోనూ టీమిండియాకు గట్టి సవాల్ విసిరింది. తొలి టీ20తోనే తమని తేలిగ్గా తీసుకోవద్దని విండీస్ వీరులు నిరూపించారు. ఆ మ్యాచ్‌కు ముందు వరకు బలంగా కనిపించిన భారత బౌలింగ్‌ను... తుత్తునియలు చేస్తూ రెండు వందలకు పైగా స్కోరు చేశారు. విరాట్, రాహుల్ చెలరేగడం వల్ల భారత్‌దే విజయమైనప్పటికీ విండీస్ గెలిచినంత పని చేసింది. రెండో మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శనతో సత్తాచాటి భారత్‌కే షాకిచ్చింది. నిర్ణయాత్మక మూడో టీ20లోనూ భారీ లక్ష్యఛేదనలో అద్భుతంగా పోరాడింది.
50 ఓవర్ల ఫార్మాట్లోనూ మజా...
వన్డే సిరీస్‌లో తొలి మ్యాచ్‌లోనే గెలిచి అందరినీ విస్మయంలో ముంచెత్తింది విండీస్. రెండో మ్యాచ్‌లో ఓడిన ఆ జట్టు.. ఇక చివరి వన్డేను ఉత్కంఠభరితంగా మార్చేసింది. మొదట ఓపెనర్లు చెలరేగడం వల్ల భారత్ సులభంగానే గెలుస్తుందనుకున్నారు. కానీ వెంటవెంటనే వాళ్లు పెవిలియన్ చేరడం.. పంత్, శ్రేయస్ కూడా విఫలమవడం మ్యాచ్‌ను విండీస్ వైపు తిప్పింది. ఆ దశలో కోహ్లీ పట్టుదలగా నిలబడి జట్టును విజయం దిశగా నడిపించాడు. చివర్లో అతడినీ పెవిలియన్ చేర్చిన కరీబియన్లు... మ్యాచ్‌ను రసవత్తరంగా మార్చేశారు.
ఎక్కువగా నిరాశ చెందాల్సిన అవసరం లేదనుకుంటున్నా. మా కుర్రాళ్ల పట్ల గర్వంగా ఉంది. బౌలింగ్, ఫీల్డింగ్‌లో కొద్దిగా తడబడ్డాం. అద్భుతంగా ఆడి మమ్మల్ని వెనక్కునెట్టిన భారత్.. ప్రపంచంలో నంబర్‌వన్ జట్టు అనే విషయాన్ని మరోసారి రుజువు చేసింది’’
- పొలార్డ్, వెస్టిండీస్ సారథి
ఆశ చిగురించేలా...
ఎలాంటి భయం, బెరుకు లేకుండా భారత బౌలర్లను అలవోకగా ఎదుర్కొంటూ పరుగులు సాధించారు వెస్టిండీస్ జట్టు బ్యాట్స్‌మెన్లు. పాత కరీబియన్ల రోజులను జ్ఞాపకం చేస్తూ... తిరిగి ఆ స్థాయికి చేరుకోగలమనే ధీమానిచ్చారు. భయం లేని ఆటతో భవిష్యత్‌పై ఆశలు చిగురింపజేశారు. కెప్టెన్ పొలార్డ్ గొప్ప నాయకత్వంతో, ఆటతో జట్టులో స్ఫూర్తి నింపాడు.
వన్డే సిరీస్‌లో హోప్ (222) ఆ జట్టు తరఫున అత్యధిక పరుగులు చేస్తే.. పూరన్ (193), హెట్‌మెయర్ (180) సత్తా చాటారు. కుర్రాళ్లు బ్యాటింగ్ మెరుపులతో ఆకట్టుకున్నారు. అయితే ఆ జట్టు బౌలింగ్ ఇంకా మెరుగుపడాల్సి ఉంది. బౌలర్లలో ప్రతిభకు కొదవలేదు. కానీ నిలకడగా వికెట్లు తీయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి.
విండీస్ యువ బ్యాట్స్‌మన్ పూరన్
13 ఏళ్లలో భారత్‌లో ద్వైపాక్షిక సిరీస్ నెగ్గని ఆ జట్టు.. ఓ దశలో చివరి వన్డేలో విజయం సాధించి సిరీస్ సొంతం చేసుకునేలా కనిపించింది. కానీ కెప్టెన్ విరాట్ కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ముందు ఓడిపోయింది. మొత్తానికి చాలా రోజుల తర్వాత రసవత్తరమైన సిరీస్ చూసిన ఆనందం... భారత అభిమానులకు కలిగింది. ఆ ఘనత కచ్చితంగా విండీస్‌కే దక్కుతుంది.