ప్రాణాంతక కరోనా (కొవిడ్ 19) నుంచి తప్పించుకోవడం ఎలాగో క్రికెటర్ డారెన్ సామీని చూసి నేర్చుకోవాలేమో! వెస్టిండీస్ మాజీ సారథి అయిన ఇతడు ఈ మధ్యే పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడాడు. వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో పీసీబీ తమ టీ20 లీగ్‌ను సెమీఫైనల్స్, ఫైనల్స్ మ్యాచ్‌లను రద్దు చేసింది. ఈ క్రమంలోనే విదేశీ ఆటగాళ్లు తమ స్వస్థలాలకు పయనమయ్యారు. సామీ ఇంటికెళ్లేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకున్నాడు. వైరస్‌బారి నుంచి తప్పించుకునేందుకు, ఎవరూ గుర్తుపట్టలేని విధంగా ఓ ప్రత్యేక మాస్క్ ధరించాడు.
'స్టార్‌వార్స్' మాస్క్‌తో కరోనాపై డారెన్ సామీ ఫైట్ - darren sammy in Self-quarantine
కరోనాను ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ తమ ప్రయత్నాల్లో ఉన్నాయి. ఈ వైరస్ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించేందుకు పలువురు క్రికెటర్లు ముందుకొస్తున్నారు. కొందరు చేతులు కడుక్కొని, మరికొందరు మాస్క్‌లు ధరించి వీడియోలు పెడుతున్నారు. విండీస్ క్రికెటర్ డారెన్ సామీ మాస్క్ పెట్టుకుని ఆసక్తికర లుక్‌లో కనిపించాడు.
ఆ ఫొటోను ట్విట్టర్లో పోస్టు చేస్తూ స్వదేశానికి చేరుకున్నానని రాసుకొచ్చాడు. పాకిస్థాన్ నుంచి బయలుదేరే ముందు కరోనా పరీక్షలు చేయించుకోగా తనకు నెగిటివ్ వచ్చిందని, అయినా ఇంటికెళ్లిన అనంతరం కుటుంబ సభ్యులతో కలవకుండా 14 రోజులు స్వీయ నిర్బంధంలో ఉంటానని చెప్పాడు. ఆ మాస్క్‌తో తీసుకున్న చిన్నపాటి వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నాడు. స్టార్‌వార్స్ సినిమాలో నటులు ధరించిన మాస్క్‌లా ఉందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. కాలక్షేపం కోసం ఇంట్లో పేపర్ రోల్‌తో ఫుట్‌బాల్ ఆడిన వీడియోనూ షేర్ చేశాడు.
ఇటీవల పాకిస్థాన్ సూపర్ లీగ్ ఆడిన ఆటగాళ్లకు, సహాయక సిబ్బందికి మొత్తం కరోనా టెస్టులు నిర్వహించారు. ఎవరికీ పాజిటివ్ రిపోర్టు రాకపోవడం వల్ల పీసీబీ ఊపిరి పీల్చుకుంది.