టీమిండియా..గతేడాది సుదీర్ఘ ఫార్మాట్ రారాజుగా నిలిచింది. భారత క్రికెటర్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. టెస్టు ఛాంపియన్‌షిప్‌లోనూ అత్యధిక పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే టెస్టు మ్యాచ్‌ల గురించి ప్రస్తావన వచ్చిన ప్రతిసారీ విండీస్ దిగ్గజ క్రికెటర్ బ్రియన్ లారా నెలకొల్పిన 400 పరుగుల రికార్డే గుర్తుకువస్తుంది. అతడి ఘనతను ఎవరు బ్రేక్ చేస్తారనేది చిక్కుప్రశ్నే. అయితే తాజాగా ఈ విషయంపై లారా సమాధానమిచ్చాడు.
" టెస్టుల్లో నేను నెలకొల్పిన 400 పరుగుల రికార్డును చెరిపేయగల సత్తా ప్రస్తుత క్రికెట్లో ముగ్గురికే ఉంది. ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్, భారత క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ.. ఈ మైలురాయిని అధిగమించగలరు. ఆసీస్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ బాగా ఆడినా.. నాలుగో స్థానంలో మైదానంలోకి రావడం వల్ల అతడికి ఈ రికార్డు కాస్త కష్టమే"
-- బ్రియాన్ లారా, వెస్టిండీస్ క్రికెటర్
టెస్టుల్లో ఇప్పటికీ 400 వ్యక్తిగత పరుగులు చేసిన రికార్డు లారా పేరిటే ఉంది. ఇంగ్లాండ్‌పై అతడు ఈ ఘనత సాధించాడు. దాదాపు 15 ఏళ్లయినా ఏ క్రికెటర్.. ఈ మైలురాయిని అందుకోలేకపోయారు.