మొతేరా తరహా పొడి పిచ్‌లపై విజయవంతమవ్వాలంటే బ్యాట్స్‌మెన్ ఫుట్‌వర్క్, షాట్ల ఎంపిక అత్యంత కచ్చితత్వంతో ఉండాలని టీమ్‌ఇండియా మాజీ సారథి మహ్మద్ అజహరుద్దీన్ అన్నాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై ఆడేటప్పుడు ఆటగాళ్లు రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించాలని సూచించాడు. డే/నైట్ టెస్టు రెండు రోజుల్లోనే ముగియడం అసంతృప్తికి గురిచేసిందని చెప్పాడు. శుక్రవారం ఆయన వరుస ట్వీట్లు చేశాడు.
ప్రపంచంలోనే అతిపెద్ద స్టేడియంలో తలపడ్డ గులాబి పోరులో భారత్, ఇంగ్లాండ్ బ్యాట్స్‌మెన్ పరుగులు చేసేందుకు విపరీతంగా శ్రమించారు. స్పిన్నర్ల బంతులను ఎదుర్కోలేక వారు త్వరగా బ్యాట్లెత్తేశారు. దాంతో ఇంగ్లాండ్ 112, 81 స్కోర్లకే పరిమితమవ్వగా టీమ్‌ఇండియా 10 వికెట్ల తేడాతో విజయం అందుకుంది.
"బ్యాటింగ్ చేసేటప్పుడు స్పైక్స్ ధరించాలన్న కనీస ఆలోచన అవసరం. రబ్బరు సోల్స్ బ్యాట్స్‌మెన్ సామర్థ్యాన్ని తగ్గించవు. రబ్బరు సోల్స్ ఉన్న బూట్లను ధరించి కఠినమైన పిచ్‌లపై అద్భుతమైన ఇన్నింగ్స్‌లు ఆడిన బ్యాట్స్‌మెన్‌ను నేను చూశా. వికెట్ల మధ్య పరిగెడుతుంటే జారిపడతారన్న వాదనను నేను అంగీకరించను. ఎందుకంటే వింబుల్డన్‌లో టెన్నిక్ క్రీడాకారులంతా రబ్బరు సోల్స్ ఉన్న బూట్లనే ధరించి ఆడతారు. ఇంకా చెప్పాలంటే సునిల్ గావస్కర్, మొహిందర్ అమర్‌నాథ్, దిలీప్ వెంగ్‌సర్కారే వంటి భారతీయులే కాకుండా సర్ వివ్‌రిచర్డ్స్, మైక్ గ్యాటింగ్, అలన్ బోర్డర్, క్లైవ్ లాయిడ్ వంటి ఎంతోమంది నాకు గుర్తొస్తారు"