ఈ ఏడాది డిసెంబరులో ఆస్ట్రేలియా పర్యటనకు టీమ్‌ఇండియా తప్పకుండా వెళ్తుందని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ స్పష్టం చేశారు. అయితే, ఆటగాళ్లకు క్వారంటైన్ సమయాన్ని తగ్గించాలని కోరారు. ఇటీవలే ఓ మీడియా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వూలో ఈ విషయాన్ని వెల్లడించారు.
"అవును. భారత్.. ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్తుంది. అయితే క్వారంటైన్ సమయం తగ్గించాలి. ఆటగాళ్లు అంత దూరం వెళ్లి హోటల్ గదుల్లో వారాల పాటు కూర్చోవడం మాకు ఇష్టం లేదు. ఇది చాలా నిరాశకు లోనయ్యేలా చేస్తుంది. మెల్బోర్న్ మినహా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలు కరోనా నుంచి కోలుకుంటున్నాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో టీమ్‌ఇండియా పర్యటనకు వచ్చినప్పుడు క్వారంటైన్ రోజులను తగ్గిస్తే మంచిందని నా అభిప్రాయం."
-సౌరభ్ గంగూలీ, బీసీసీఐ అధ్యక్షుడు
తన అధ్యక్ష పదవిపై స్పందించిన గంగూలీ.. అది ఎంత కాలం ఉంటుందో తెలియదన్నారు. ఈ ఏడాది చివరికల్లా తాను బీసీసీఐ బాస్‌గా ఉంటానో లేదో తెలియదని, కానీ.. కోహ్లీ కెప్టెన్సీ మాత్రం చిరస్థాయిలో మిగిలిపోతుందని పేర్కొన్నారు. రాబోయే ఆస్ట్రేలియా సిరీస్ ఎంతో కీలకమని వెల్లడించారు. కోహ్లీతో పాటు టీమ్‌ఇండియా ఆటగాళ్లందర్నీ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండమని చెప్పినట్లు తెలిపారు.
ఇక మహమ్మారి సమయంలోనూ బోర్డు కార్యకలాపాలు కొనసాగిస్తోందని వస్తున్న వార్తలపై గంగూలీ స్పందిస్తూ.. "అదంతా ఆవాస్తవం. ముంబయిలోని కార్యాలయానికి మేము ఎవ్వరం రాలేదు. బీసీసీఐ అధ్యక్షుడిగా ఉండి ఇప్పటికి ఏడు నెలలకుపైగా అయ్యింది. అందులో నాలుగు నెలలు కరోనానే ఆక్రమించింది. ప్రస్తుతం మేము వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విధులు నిర్వర్తిస్తున్నాం." అంటూ సమాధానమిచ్చాడు.
కరోనా మహమ్మారి కారణంగా విధించిన లాక్‌డౌన్‌తో 6 నెలలకు పైగా క్రీడా కార్యక్రమాలు నిలిచిపోయాయి. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్, వెస్టిండీస్ మధ్య తొలి టెస్టు ప్రారంభమైంది. అయితే, ఈ మహమ్మారి ఆట నియమాలను మార్చేసింది. పర్యటనకు వచ్చిన ఆటగాళ్లు మైదానంలో అడుగుపెట్టే ముందు రెండు వారాల పాటు క్వారంటైన్లో ఉండాలని ఐసీసీ నిర్ణయించింది. అనంతరం వైరస్ పరీక్షలు చేయించుకోవాలని స్పష్టం చేసింది.