ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో తమ ఓటమిపై స్పందించాడు టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ. బౌలర్లు పేలవంగా ఆడటం వల్లే జట్టు పరాజయాన్ని చూసిందని అన్నాడు.
"మేం పేలవ ప్రదర్శన చేశాం. బౌలింగ్‌లో సత్తాచాటలేకపోయాం. సరైన ప్రదేశాల్లో బంతులు సంధించడంలో విఫలమయ్యాం. అయితే ఆస్ట్రేలియాకు బలమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. ఇక్కడి పరిస్థితులు వారికి బాగా తెలుసు. కాగా, ఛేదనలో మేం 340 పరుగులు సాధించాం. విజయానికి 50 పరుగుల దూరంలో ఆగిపోయాం. కాబట్టి ఛేదన సాఫీగానే సాగిందని చెప్పొచ్చు. ఒకటి, రెండు వికెట్లు పడితే కావాల్సిన రన్‌రేటు 13 నుంచి 16కి చేరుతుంది. అందుకే దూకుడుగా ఆడటానికి ప్రయత్నించాం".
-కోహ్లీ, టీమ్ఇండియా సారథి.
మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ క్యాచ్‌లను ఆస్ట్రేలియా ఫీల్డర్లు అద్భుతంగా అందుకున్నారు. దీని గురించి కోహ్లీ మాట్లాడుతూ.. "ఆసీస్ జట్టు మైదానంలో అవకాశాలను సృష్టించుకొని సాధించింది. అదే మ్యాచ్‌లో తేడా. లేకపోతే మ్యాచ్ పోటాపోటీగా సాగేది. పరిస్థితులకు తగ్గట్లుగా ఆసీస్ బౌలర్లు చక్కగా బౌలింగ్ చేశారు. అయితే 40-41 ఓవర్ల వరకు నేను, కేఎల్ రాహుల్ క్రీజులో ఉండాలనుకున్నాం. ఆఖరి 10 ఓవర్లలో 100 పరుగులు సాధించాల్సిన తరుణంలో హార్దిక్ వచ్చి పని పూర్తిచేస్తాడని భావించాం. కానీ ఆ రెండు క్యాచ్‌లు మ్యాచ్ గమనాన్ని మార్చేశాయి" అని కోహ్లీ అన్నాడు.
మరోవైపు తమ జట్టు అద్భుత ప్రదర్శన చేయడంపై ఆటగాళ్లను ప్రశంసించాడు ఆసీస్ సారథి ఫించ్. స్మిత్ అసాధారణమైన ప్రదర్శన, వార్నర్ జోరు విజయంలో కీలక పాత్ర పోషించాయని చెప్పాడు.