తెలంగాణ

telangana

ETV Bharat / sports

కోహ్లీ అలా చేస్తే.. మాకు మంచిది: స్టోక్స్

భారత కెప్టెన్ కోహ్లీ దూకుడు తమ జట్టుపై ఎలాంటి ప్రభావం చూపదని స్టోక్స్ అభిప్రాయపడ్డాడు. మెరుగ్గా మారేందుకు అనువైన దారినే ఎంచుకుంటామని తెలిపాడు.

By

Published : Mar 26, 2021, 8:57 AM IST

We prefer a Virat Kohli who doesn't score runs: Ben Stokes
కోహ్లీ

దూకుడైన దేహభాష.. కోహ్లీ, టీమ్‌ఇండియాకు పనిచేస్తుందేమో గానీ ఇంగ్లాండ్‌ ఆటతీరుపై ప్రభావం చూపదని ఆ జట్టు ఆల్‌రౌండర్‌ బెన్‌స్టోక్స్‌ అన్నాడు. మైదానంలో ఒక్కో జట్టు, ఒక్కో ఆటగాడు ఒక్కోలా సంబరాలు చేసుకుంటారని తెలిపాడు. బహుశా అదే వారిని విజయవంతం చేయొచ్చన్నాడు. నాలుగైదేళ్లుగా తమ జట్టుకు పనిచేస్తున్న వ్యూహం మాత్రం అదికాదని వెల్లడించాడు. శుక్రవారం రెండో వన్డే జరగనున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు.

'మమ్మల్ని మెరుగైన జట్టుగా మార్చేందుకు అత్యుత్తమైన దారినే మేం ఎంచుకుంటాం. ప్రతి జట్టు తమకు అనువైన దారిలోనే నడుస్తుంది. భారత్‌, ఇంగ్లాండ్‌కు వేర్వేరు పద్ధతులు ఉన్నాయి' అని స్టోక్స్‌ అన్నాడు. కోహ్లీ ప్రశాంతంగా ఉంటే బాగుంటుందా, దూకుడుగా ఉంటే బాగుంటుందా అని అడగ్గా 'వ్యక్తిగతంగా చెప్పాలంటే అతడు పరుగులు చేయకపోతే బాగుంటుంది. ఎందుకంటే అది మా జట్టుకు మంచిది' అని వెల్లడించాడు.

బెన్ స్టోక్స్

వన్డే సిరీస్‌ ఓడితే ఇంగ్లాండ్‌ నంబర్‌వన్‌ ర్యాంకు పోయే ప్రమాదముందని ప్రశ్నించగా 'మా ఫలితాలు, మా ఆటతీరును బట్టి మేం నంబర్‌ వన్‌కు అర్హులం. అగ్రస్థానంలో ఉండటం ఎవరికైనా ఆనందమే. అయితే అదే మమ్మల్ని నడిపించడం లేదు. ఆట పట్ల మా వైఖరి, మేమెలా ఆడుతున్నామన్నదే మమ్మల్ని ముందుకు నడిపిస్తోంది. అదే మమ్మల్ని విజయవంతం చేసింది. నంబర్‌ వన్‌గా మార్చింది' అని స్టోక్స్‌ చెప్పాడు.

జో రూట్‌ లేకపోవడం వల్లే మూడో స్థానంలో ఆడుతున్నానని ఇందుకోసం తన ఆటతీరును మార్చుకోలేదని స్టోక్స్‌ పేర్కొన్నాడు. ఆ స్థానంలో ఎలా ఆడాలని ప్రశ్నించగా 'నీలా నువ్వు ఆడు' అని రూట్ తనకు సమాధానం ఇచ్చాడని వెల్లడించాడు. ఫినిషర్‌గా సాధారణంగా 60 బంతులు ఆడితే మూడో స్థానంలో వంద వరకు ఎదుర్కోవాల్సి రావొచ్చన్నాడు. రాజస్థాన్‌ రాయల్స్‌కు ఓపెనింగ్‌ చేసినప్పటికీ ఇంగ్లాండ్‌లో ప్రతి స్థానానికి అర్హులైన వారు ఉన్నారని తెలిపాడు. లియామ్‌ లివింగ్‌స్టన్‌కు అవకాశం దొరికితే నిర్భయంగా అతడు క్రికెట్‌ ఆడగలడని ధీమా వ్యక్తం చేశాడు.

ABOUT THE AUTHOR

...view details