పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్ర నష్టాల్లో ఉందని, అయితే తమ మనుగడకు భారత్ సాయం అవసరం లేదని పీసీబీ ఛైర్మన్ ఎహెసన్ మణి అన్నాడు. టీమిండియాతో ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంపై స్పందిస్తూ, తన అక్కసును మరోసారి బయటపెట్టాడు.
"మేం నష్టాలతో బాధపడుతున్నాం. అయినా మా ఆలోచనల్లో, ప్రణాళికల్లో భారత్ లేదు. వారు లేకుండానే మేం మనుగడ సాధించగలం. వారు మాతో ఆడాలని భావించకపోతే, మేమూ వారు లేకుండానే ఆడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటాం. గతంలో ఒకటి లేదా రెండుసార్లు ఆడతామని చెప్పి, ఆఖర్లో తమ నిర్ణయాన్ని మార్చుకున్నారు" -ఎహెసన్ మణి, పీసీబీ ఛైర్మన్
ప్రస్తుతం భారత్‌తో ఐసీసీ టోర్నీలు, ఆసియా కప్‌లో మాత్రమే ఆడుతున్నామని మణి పేర్కొన్నాడు. ఆటపై ఎంతో ఆసక్తితో ఉన్నామని, రాజకీయాలను, క్రీడలను వేరుగా ఉంచాలనుకుంటున్నామని వెల్లడించాడు. 2008లో ముంబయిలో జరిగిన ఉగ్రదాడి తర్వాత పాకిస్థాన్‌తో టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌ల్లో పాల్గొనట్లేదు. కేవలం ఐసీసీ నిర్వహించే టోర్నీల్లో మాత్రమే ఆడుతోంది.
కరోనా సహాయ చర్యల కోసం నిధులు సమీకరించేందుకు భారత్×పాక్ జట్లు మూడు వన్డేల సిరీస్ నిర్వహించాలని ఇటీవల అక్తర్ అభిప్రాయం వ్యక్తం చేశాడు. అయితే అతడి వ్యాఖ్యలను భారత మాజీ క్రికెటర్ కపిల్‌దేవ్ తిరస్కరించాడు. తమకు డబ్బు అవసరం లేదని, ప్రాణాలను పణంగా పెట్టి మ్యాచ్‌ను ఆడాల్సిన అవసరం లేదని అన్నాడు. సంజయ్ మంజ్రేకర్.. ఈ విషయంపై స్పందిస్తూ సమీప భవిష్యత్తులో భారత్×పాక్ ద్వైపాక్షిక సిరీస్‌ల్లో తలపడే అవకాశాలు కనిపించట్లేదని పేర్కొన్నాడు.
ఇదీ చూడండి :' ప్రేక్షకులు లేని స్టేడియంలో కోహ్లీ ఎలా ఆడతాడో ?'