భారత మాజీ దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రవిడ్‌కు కెప్టెన్‌గా సరైన గౌరవం దక్కలేదని అభిప్రాయపడ్డాడు మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్. జట్టుకు మెరుగైన సేవలు అందించినా.. ద్రవిడ్‌ను విస్మరించారని తెలిపాడు. టీమ్ఇండియాలో సచిన్‌తో పోల్చదగిన ప్రభావాన్ని చూపినప్పటికీ దేశంలో ద్రవిడ్‌కు తగిన క్రెడిట్ లభించలేదని తాజాగా వెల్లడించాడు గంభీర్.
"రాహుల్ ద్రవిడ్ నాయకత్వానికి తగిన గౌరవాన్ని ఇవ్వకపోవడం దురదృష్టకరం. మనం సౌరభ్ గంగూలీ, ధోనీ కెప్టెన్సీ గురించి మాట్లాడాం. ఇప్పుడు విరాట్ కోహ్లీ సారథ్యం గురించి చర్చించుకుంటున్నాం. కానీ, టీమ్ఇండియాకు అద్భుతమైన నాయకుడిగా వ్యవహరించిన రాహుల్ ద్రవిడ్‌ను గుర్తించలేకపోయాం. ఆయన రికార్డులను గమనిస్తే ద్రవిడ్‌ను క్రికెటర్‌గా, కెప్టెన్‌గానూ చాలా తక్కువగా చూశారని అర్థమవుతుంది. ఇంగ్లాండ్, వెస్టిండీస్‌లతో సహా మరో 14 నుంచి 15 సిరీస్‌లను ద్రవిడ్ నాయకత్వంలో గెలుపొందాం".