తెలంగాణ

telangana

ETV Bharat / sports

'జడేజా రనౌట్​పై అప్పీల్ చేశాం.. అంపైర్ చూడలేదు' - జడేజా రనౌట్

చెన్నై వేదికగా విండీస్​తో జరిగిన తొలి వన్డేలో జడేజా రనౌట్​పై కరీబియన్ల సారథి పొలార్డ్ స్పందించాడు. అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేది చూస్తానని చెప్పాడు.

We appealed, the umpire didn't take it at that time: Pollard on Jadeja run-out controversy
'జడేజా రనౌట్​పై అప్పీల్ చేశాం.. అంపైర్ చూడలేదు'

By

Published : Dec 16, 2019, 12:15 PM IST

వెస్టిండీస్​తో జరిగిన తొలి వన్డేలో రవీంద్ర జడేజా రనౌట్​ చర్చనీయాంశమవుతోంది. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా అంపైర్ల నిర్ణయంపై అసంతృప్తి వ్యక్తం చేశాడు. ఈ అంశంపై విండీస్ సారథి కీరన్ పోలార్డ్ స్పందించాడు. రనౌట్​పై అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేదే తనకు ముఖ్యమని అన్నాడు.

"జడేజా రనౌట్​ను ముందే మేము అప్పీల్ చేశాం. ఆ సమయంలో అంపైర్ పట్టించుకోలేదు. రనౌట్​పై అంతిమంగా సరైన నిర్ణయం తీసుకున్నారా లేదా అనేదే నాకు ముఖ్యం. ఈ విజయంలో హెట్‌మెయర్ కీలక పాత్ర పోషించాడు. అతడు గత 9 నెలల నుంచి ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. అతడి ఇన్నింగ్స్‌పై జట్టు యాజమాన్యం ఎంతో సంతోషంగా ఉంది. ప్రతి ఆటగాడు బాధ్యతాయుతంగా, జవాబుదారీతనంగా ఆడాలి. కాట్రెల్ అద్భుతంగా బౌలింగ్‌ చేశాడు" - కీరన్ పొలార్డ్, విండీస్ కెప్టెన్​

అసలేం జరిగింది...

కీమో పాల్‌ వేసిన 48వ ఓవర్లో జడేజా సింగిల్‌ కోసం ప్రయత్నించాడు. ఫీల్డర్‌ చేజ్‌ నేరుగా విసిరిన బంతి నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌లో వికెట్లను గిరాటేయగా.. అప్పటికీ జడేజా తన బ్యాట్‌ను క్రీజులో పెట్టలేదు. అది ఎవరూ గుర్తించలేదు. విండీస్‌ ఫీల్డర్లు కూడా అప్పీలు చేయలేదు. కానీ భారీ తెరపై రీప్లేలో జడేజా రనౌటైనట్టుగా చూపించాక అంపైర్‌ షాన్‌ మూడో అంపైర్‌ను సంప్రదించాడు. దీంతో జడేజా రనౌటయ్యాడు. దీనిపై కోహ్లీ తీవ్ర అసహనాన్ని ప్రదర్శించాడు. తన కుర్చీలో నుంచి లేచి మైదానం వైపు వచ్చి ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఆదివారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత్‌ ఎనిమిది వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. హెట్‌మెయిర్‌ (139), హోప్‌ (102*) విండీస్ విజయంలో కీలక పాత్ర పోషించారు. విశాఖ వేదికగా రెండో వన్డే బుధవారం జరగనుంది.

ఇదీ చదవండి: నా బయోపిక్​లో ఆమిర్ నటించాలి: విశ్వనాథన్ ఆనంద్

ABOUT THE AUTHOR

...view details