టీమిండియా ప్రధాన కోచ్‌గా రెండోసారి ఎంపికైన రవిశాస్త్రి.. ప్రస్తుతం వెస్టిండీస్ పర్యటనలో ఉన్నాడు. కరీబియన్ జట్టుపై తొలి టెస్టు గెలిచిన భారత ఆటగాళ్లు.. విరామాన్ని సద్వినియోగం చేసుకుంటూ సరదాగా గడుపుతున్నారు. వీరితో పాటు కోచ్‌లు రవిశాస్త్రి, భరత్ అరుణ్, ఆర్.శ్రీధర్.. జమైకాలోని బాబ్ మార్లే మ్యూజియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మార్లే పాట పాడి ఆకట్టుకున్నాడు రవిశాస్త్రి.
బాబ్ మార్లే.. పాప్ ప్రియులు మరిచిపోలేని పేరు. ఈ జమైకన్ సింగర్ ఎన్నో ప్రఖ్యాత పాటలతో ఉర్రూతలూగించాడు. అతడి పేరు మీదుగా అక్కడ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. ఈ ప్రదేశాన్ని సందర్శించిన రవిశాస్త్రి.. 1983 పర్యటనలోని మధుర జ్ఞాపకాల్ని గుర్తుచేసుకున్నాడు.
"37 ఏళ్ల తర్వాత జమైకా వచ్చాను. మొదటిసారి 1983లో విండీస్ పర్యటనకు వచ్చా. అప్పుడు నా వయసు 21 సంవత్సరాలు. మార్లే సంగీతం అద్భుతంగా ఉంటుంది. మైదానంలో అడుగుపెట్టే ముందు మార్లే పాటలు వింటే ఎంతో స్ఫూర్తి లభిస్తుంది". -రవిశాస్త్రి, టీమిండియా కోచ్
ప్రపంచకప్ తర్వాత టీమిండియా కోచ్ మార్పు జరుగుతుందని అంతా భావించారు. కానీ మరోసారి రవిశాస్త్రికే బాధ్యతలను అప్పగిస్తూ క్రికెట్ సలహా కమిటీ నిర్ణయం తీసుకుంది. ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్, బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్లనూ కొనసాగించింది ఎమ్మెస్కే ప్రసాద్ ఆధ్వర్యంలోని సెలక్షన్ కమిటీ. కేవలం బ్యాటింగ్ కోచ్‌గా ఉన్న సంజయ్ బంగర్‌కు మాత్రమే ఉద్వాసన పలికింది. అతడి స్థానంలో విక్రమ్ రాఠోడ్‌ను ఎంపిక చేసింది.
ఇవీ చూడండి.. హీరో వరుణ్‌తో క్రికెట్.. కాంబ్లీతో టెన్నిస్