భారత్‌కు తొలిసారి వన్డే ప్రపంచకప్ అందించిన కపిల్‌దేవ్.. దిగ్గజ స్పిన్నర్ బిషన్‌సింగ్ బేడీ నాయకత్వంలో అరంగేట్రం చేశారు. సునీల్ గావస్కర్ సారథ్యంలో ఎక్కువగా ఆడారు. అయితే 1978-79 సీజన్‌లో మాత్రం స్పిన్నర్ ఎస్.వెంకటరాఘవన్ కెప్టెన్సీలో ఆడారు. అప్పుడు కొత్త కుర్రాడు కావడం వల్ల వెంకటరాఘవన్ వల్ల చాలా ఇబ్బంది పడ్డానని కపిల్ గుర్తుచేసుకున్నారు. తన ముఖం చూస్తేనే ఆయన చిరాకుపడేవారని అన్నారు. వీడ్కోలు పలికిన తర్వాత అంపైర్‌గా చేసిన రాఘవన్.. బౌలర్లు అప్పీల్ చేస్తే నాటౌట్ అని చెప్పడమూ మందలించినట్టుగానే ఉండేదని వెల్లడించారు.
"1979లో ఇంగ్లాండ్‌కు వెళ్లినప్పుడు వెంటకరాఘవన్ సారథి. భయంతో డ్రస్సింగ్‌రూమ్‌లో ఆయనకు కనిపించకుండా ఉండేవాడిని. జట్టులో బేడీ, ప్రసన్న, చంద్రశేఖర్ వంటి సీనియర్లు ఉండేవారు. వాళ్లను ఆయన ఏం అనేవారు కాదు. అందుకే నేను కనిపిస్తే అంతే సంగతులు. ఉరిమినట్టు చూసేవారు. సాధారణంగా నేను ఎక్కువగా తింటాను. ఎప్పుడు చూసినా తింటూనే ఉంటానన్నట్టు ఆయన చూపులుండేవి. అందుకే కనిపించకుండా ఓ మూలకు నక్కేవాడిని" అని కపిల్ గుర్తు చేసుకున్నారు.