అంతర్జాతీయ కెరీర్‌పై పునరాలోచించాల్సి వస్తోందని అన్నాడు ఆస్ట్రేలియా స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్. అందుకు కారణంగా కరోనా వైరస్ అంటున్నాడు. కుటుంబానికి దూరంగా ఉంటూ.. అనేక షరతులు, పరిమితుల మధ్య మ్యాచ్‌లు ఆడాల్సి రావడంపై ఆందోళన వ్యక్తం చేశాడు.
"నా భార్య ముగ్గురు అమ్మాయిలకు నేను ఎంతగానో రుణపడి ఉన్నా. నా కెరీర్లో వీరి పాత్ర కీలకం. ఏం చేయాల్నా కుటుంబానికే తొలి ప్రాధాన్యం. ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో ఆడాల్సి వచ్చినప్పుడు అన్ని అంశాలు బేరీజు వేసుకోవాలి. సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్ ఆడి, గెలవాలని ఆశించాం. కానీ అది వెనక్కి వెళ్లిపోయింది. వచ్చే ఏడాది భారత్‌లో జరిగే టీ20 ప్రపంచకప్ విషయంలో పునరాలోచించాల్సి వస్తోంది. అప్పటికి నేనే స్థితిలో ఉంటాను. నా కూతుళ్లు స్కూల్లో ఏ స్థాయిలో ఉంటారు అన్నది చూడాలి. ఇవన్నీ నా నిర్ణయంలో కీలకంగా ఉంటాయి. ఎప్పుడు ఆడతాం. ఎంత ఆడతాం అన్నది ప్రధానం కాదు. కుటుంబమే నాకు అత్యంత ముఖ్యం" అని వార్నర్ అన్నాడు.