దీపావళి రోజున భారత్‌లో పేలాల్సిన టపాసుల మోత ఆస్ట్రేలియా ఆడిలైడ్‌లో మోగింది. ఆ జట్టు ఓపెనర్ డేవిడ్ వార్నర్.. శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో విశ్వరూపం చూపించాడు. పొట్టి ఫార్మాట్లో ఇప్పటివరకు శతకాన్ని అందుకోని ఈ క్రికెటర్.. ఈ మ్యాచ్‌లో ఆ ఘనత సాధించాడు. నేడు అతడి పుట్టినరోజు కావడం మరో విశేషం.
56 బంతుల్లో 100 పరుగులు పూర్తి చేసి విధ్వంసం సృష్టించాడు వార్నర్. ఇందులో 10 ఫోర్లు, 4 సిక్సర్లు ఉన్నాయి. ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు భారీ స్కోరు అందించాడు. ఫలితంగా శ్రీలంక.. 134 పరుగుల తేడాతో ఘోర పరాజయం చవిచూసింది.
కెప్టెన్ అరోన్ ఫించ్(64: 36 బంతుల్లో)తో కలిసి తొలి వికెట్‌కు 122 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు వార్నర్. వేగంగా ఆడుతూ ఫించ్ అర్ధ శతకం పూర్తి చేశాడు. అనంతరం అతడు ఔటైనా.. తన దూకుడును మాత్రం తగ్గించలేదు.