తెలంగాణ

telangana

ETV Bharat / sports

ప్రాక్టీస్​ మ్యాచ్​లో కివీస్​ చేతిలో భారత్​ ఓటమి

ప్రపంచకప్​ ముందు జరిగిన ప్రాక్టీసు మ్యాచ్​లో భారత క్రికెట్ జట్టు ఓటమి చవిచూసింది. భారత్​ నిర్దేశించిన 180 పరుగులు లక్ష్యాన్ని చేధించిన న్యూజిలాండ్​ 6 వికెట్ల తేడాతో గెలిచింది. కివీస్​ కెప్టెన్ విలియమ్సన్, రాస్ టేలర్ అర్ధసెంచరీలతో రాణించారు. టీమిండియా బ్యాట్స్​మెన్​లో జడేజా మినహా మరెవరూ రాణించలేదు.

ప్రాక్టీస్​ మ్యాచ్​లో టీమిండియా ఘోర పరాభవం

By

Published : May 25, 2019, 10:10 PM IST

ప్రపంచకప్​లో టీమిండియాకు ఇది కలవరపరిచే అంశం. ఫేవరెట్లలో ఒకటైన భారత్.. శనివారం ఓవల్ వేదికగా జరిగిన ప్రాక్టీస్​ మ్యాచ్​లో న్యూజిలాండ్​ చేతిలో ఆరు వికెట్ల తేడాతో ఓడింది. బ్యాట్స్​మెన్ ఘోరంగా విఫలమయ్యారు. ఒక్క జడేజా మినహా మరెవరూ చెప్పుకోదగ్గ స్కోరు సాధించలేకపోయారు. బౌలర్లూ ప్రభావం చూపించలేకపోయారు.

180 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కివీస్​.. మొదట్లోనే మన్రో వికెట్​ను కోల్పోయింది. ఆ తర్వాత కొద్ది సేపటికే గప్తిల్ పెవిలియన్ చేరాడు.

కివీస్ జోడీ హిట్

అనంతరం క్రీజులోకి వచ్చిన టేలర్, కెప్టెన్ విలియమ్సన్​తో కలిసి నిలకడగా ఆడాడు. ఈ క్రమంలో ఇద్దరు అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. మూడో వికెట్​కు 114 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్ష్యానికి చేరువవుతున్న వేళ 67 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద విలియమ్సన్ ఔటయ్యాడు. గెలిచేందుకు మరో పరుగు చేయాల్సిన సమయంలో 71 పరుగులు చేసిన టేలర్ పెవిలియన్ బాట పట్టాడు. తర్వాతి బ్యాట్స్​మెన్​ లాంఛనాన్ని పూర్తి చేశారు.

కెప్టెన్ ఇన్నింగ్స్​ ఆడిన న్యూజిాలాండ్​ సారధి విలియమ్సన్

టీమిండియా బౌలర్లలో బుమ్రా, హార్దిక్ పాండ్య, చాహల్, జడేజా తలో వికెట్ తీశారు.

అంతకు ముందు టాస్ గెలిచి బ్యాటింగ్​ ఎంచుకున్న కోహ్లీసేన.. ఆకట్టుకోలేకపోయింది. ఇన్నింగ్స్​ ప్రారంభం నుంచి ప్రత్యర్థి జట్టులోని బౌలర్లు కచ్చితమైన లైన్​ అండ్​ లెంగ్త్​తో బౌలింగ్​ చేశారు. పరుగులు చేసేందుకు భారత బ్యాట్స్​మెన్ కష్టపడ్డారు. వరుసగా వికెట్లు సమర్పించుకున్నారు. ఒక్క జడేజా మినహా బ్యాట్స్​మెన్ అందరూ విఫలమయ్యారు. హార్దిక్ పాండ్య కొద్ది సేపు క్రీజులో నిలిచినా 30 పరుగులు చేసి నీషమ్ బౌలింగ్​లో ఔటయ్యాడు.

కివీస్ బౌలర్ ట్రెంట్ బౌల్ట్

జడేజా నిలబడ్డాడు.. పరువు కాపాడాడు

లోయర్ ఆర్డర్​లో వచ్చిన జడేజా అనూహ్యంగా కివీస్​ బౌలర్లపై చెలరేగాడు. సమయోచితంగా ఆడుతూ గౌరవప్రదమైన స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు. 50 బంతుల్లో 54 పరుగులు చేసి తొమ్మిదో వికెట్​గా వెనుదిరిగాడు.

టీమిండియా క్రికెటర్ రవీంద్ర జడేజా

మిగతా బ్యాట్స్​మెన్​లో రోహిత్ 2, ధావన్ 2, కోహ్లీ18, రాహుల్ 6, హార్దిక్ 30, ధోని 17, దినేశ్ కార్తిక్ 4, భువనేశ్వర్ 1, షమి 2, కుల్​దీప్​ 19 పరుగులు చేశారు.

న్యూజిలాండ్​ బౌలర్లలో బౌల్ట్ 4 వికెట్లు దక్కించుకోగా, నీషమ్ 3, సౌతీ, గ్రాండ్​హమ్, ఫెర్గ్యూసన్ తలో వికెట్ తీశారు.

ABOUT THE AUTHOR

...view details