ప్రస్తుతం క్రికెట్ ప్రపంచమంతా భారత్-ఆసీస్ టెస్టు సిరీస్ గురించే చర్చిస్తోంది. సమవుజ్జీల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉంటుందని మాజీ ఆటగాళ్లు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. తాజాగా పాకిస్థాన్ మాజీ పేసర్ వకార్ యూనిస్ కూడా టెస్టు సిరీస్ గురించి తన యూట్యూబ్ ఛానెల్లో విశ్లేషించాడు. 2018లో స్వదేశంలో టెస్టు సిరీస్ కోల్పోవడం వల్ల ఈ సారి టీమ్ఇండియాపై.. ఆస్ట్రేలియా ప్రతీకారం తీర్చుకోవాలని ప్రయత్నిస్తుందని అన్నాడు.
"మెరుగైన పేస్ దళంతో పాటు డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ జట్టులో ఉండటం, అంతేగాక స్వదేశంలో మ్యాచ్ జరుగుతుండటం వల్ల ఆస్ట్రేలియా ఎంతో పటిష్ఠంగా కనిపిస్తోంది. అయితే టీమ్ఇండియాలోనూ గొప్ప బౌలర్లు ఉన్నారు. గత పర్యటనలో వాళ్లు సత్తాచాటారు. బ్యాటింగ్లో పుజారా, రహానె వంటి నాణ్యమైన బ్యాట్స్మెన్ కూడా ఉండటం వల్ల ఇరు జట్ల మధ్య పోటీ తీవ్ర స్థాయిలో ఉంటుంది"
- వకార్ యూనిస్, పాక్ మాజీ క్రికెటర్
కోహ్లీ గైర్హాజరీతో పాటు రోహిత్, ఇషాంత్ జట్టుకు దూరమవ్వడం భారత్కు ప్రతికూలాంశమని అన్నాడు. "రోహిత్ గొప్ప బ్యాట్స్మన్, ఇషాంత్ తన అనుభవంతో వికెట్లు సాధించగలడు. టెస్టుల్లో వాళ్లు లేకపోవడం టీమ్ఇండియాకు లోటు" అని వకార్ చెప్పాడు.
పితృత్వ సెలవులపై కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమవుతున్నాడు. తొలి టెస్టు అనంతరం అతడు స్వదేశానికి రానున్నాడు. పూర్తి ఫిట్నెస్ సాధించని రోహిత్ శర్మ, ఇషాంత్ శర్మ కూడా తొలి రెండు టెస్టులకు దూరమయ్యారు. అయితే ఆస్ట్రేలియాలో కఠిన క్వారంటైన్ నిబంధనలు, గాయం నుంచి కోలుకోవడానికి కొన్ని వారాల సమయం పడుతుండటం వల్ల వారిద్దరు చివరి టెస్టులకు కూడా అనుమానమే అని వార్తలు వస్తున్నాయి. కాగా, నవంబర్ 27 నుంచి ప్రారంభం కానున్న ఆస్ట్రేలియా సుదీర్ఘ పర్యటనలో భారత్ మూడు వన్డేలు, మూడు టీ20లు, నాలుగు టెస్టులు ఆడనుంది. సిడ్నీ వేదికగా తొలి వన్డే శుక్రవారం జరగనుంది.
ఇదీ చూడండి : 'ఈసారి టీమ్ఇండియాతో కవ్వింపులు ఉండవ్'