భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ తెందుల్కర్‌పై పాకిస్థాన్ మాజీ సారథి ఇంజమామ్ ఉల్ హక్ ప్రశంసల జల్లు కురిపించాడు. వన్డేల్లో సచిన్ ద్విశతకం సాధించి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఇంజమామ్ మాట్లాడాడు. పదహారేళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టిన సచిన్ ఎన్నో రికార్డులను సొంతం చేసుకున్నాడని కొనియాడాడు. ప్రపంచ క్రికెటర్లలో తెందుల్కర్ అత్యుత్తమ ఆటగాడని, అలా చెప్పడానికి నాలుగు కారణాలు ఉన్నాయని తెలిపాడు.
>> "సచిన్ క్రికెట్ కోసమే పుట్టాడు. క్రికెట్, అతడు అత్యుత్తమ జోడీ. నేను ఇప్పటికీ ఆశ్యర్చంలోనే ఉన్నా.. 16-17 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేసిన అతడు ఎన్నో ఘనతలు సాధించాడు. ఇది అద్భుతమైన నైపుణ్యం ఉన్న ఆటగాడికే సాధ్యమవుతుంది. సచిన్‌కు అంతకు మించిన నైపుణ్యం సొంతం. అతడు 16 ఏళ్లకే వకార్, వసీమ్ వంటి బౌలర్లను ఎదుర్కొన్నాడు. ప్రపంచ ప్రమాదకర బౌలర్లను అతడు ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయం."
>>"సచిన్ అత్యుత్తమం అనడానికి మరో కారణం అతడి రికార్డులు. అతడు సాధించిన పరుగులు, శతకాల రికార్డు ఇప్పటికీ పదిలంగానే ఉంది. గొప్ప ఆటగాళ్లు 8 - 8.5 వేల పరుగులు సాధిస్తారు. సునీల్ గావస్కర్ 10 వేల పరుగులు సాధించాడు. కానీ సచిన్ మాత్రం అందరి రికార్డులను బద్దలు కొట్టి పరుగుల ప్రవాహమే సృష్టించాడు. ఇప్పుడు అతడి రికార్డును ఎవరూ అధిగమిస్తారని ఎదురుచూస్తున్నాను."