కరోనా ప్రభావం ఉన్నప్పటికీ స్వదేశంలోనే భారత్-ఇంగ్లాండ్ సిరీస్ నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నామని బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్ గంగూలీ అన్నాడు. దేశవాళీ క్రికెట్ పునఃప్రారంభంపై సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్నామని చెప్పాడు. తమ అభిమాన ఆటగాళ్లు స్వదేశంలో త్వరలో ఆడటం చూస్తారని తెలిపాడు. ఇందుకోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు దాదా స్పష్టం చేశాడు.
షెడ్యూల్ ప్రకారం, ఈ ఏడాది సెప్టెంబరు-అక్టోబరులో ఇంగ్లాండ్తో పరిమిత ఓవర్ల సిరీస్ టీమ్ఇండియా ఆడాలి. కరోనా వల్ల వచ్చే ఏడాది ప్రారంభంలో దీనిని జరపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఒకవేళ అప్పటికీ వైరస్ ఉద్ధృతి తగ్గకపోతే ఈ సిరీస్ను యూఈఏకి తరలించాలని బోర్డు భావిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే పుకార్లకు చెక్ పెడుతూ గంగూలీ.. ఇక్కడే ఉంటుందని స్పష్టం చేశాడు.