ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో అత్యంత విజయవంతమైన సారథి ఎవరంటే ముందుగా చెప్పే పేరు రోహిత్ శర్మ. నాలుగుసార్లు ముంబయి ఇండియన్స్‌ను విజేతగా నిలిపాడు. మహేంద్రసింగ్ ధోనీ (3 టైటిళ్లు) కన్నా ఒకడుగు ముందే ఉన్నాడు. అయితే ఒత్తిడిలోనూ ప్రశాంతంగా ఉండటమే హిట్‌మ్యాన్ విజయాలకు కారణమని వీవీఎస్ లక్ష్మణ్ అన్నాడు. దక్కన్ ఛార్జర్స్ తరఫున తొలి ఐపీఎల్ ఆడినప్పటి నుంచే బ్యాట్స్‌మన్, నాయకుడిగా అతడు ఎదిగాడని వెల్లడించాడు.
"దక్కన్ ఛార్జర్స్‌కు ఆడుతున్నప్పుడే అతడు నాయకుడిగా ఎదిగాడు. తొలిసారి వచ్చినప్పుడు అతడో యువకుడు. టీమ్‌ఇండియా తరఫున అరంగేట్రం చేసి ఒక టీ20 ప్రపంచకప్ ఆడాడంతే. 2008 అరంగేట్ర ఐపీఎల్‌లో డీసీ చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. అయినా రోహిత్ అద్భుతంగా ఆడాడు. ఒత్తిడి చిత్తుచేస్తున్నా మిడిలార్డర్‌లో మెరుగ్గా బ్యాటింగ్ చేసేవాడు."