సొగసరి బ్యాట్స్‌మన్‌గా పేరు తెచ్చుకున్న వీవీఎస్ లక్ష్మణ్.. భారత క్రికెట్ చరిత్రలో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తున్న ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించిన పోరాట యోధుడు. తన ప్రదర్శనతో టీమ్ఇండియాకు ఎన్నో విజయాలు అందించిన అద్భుత క్రికెటర్. కంగారూ జట్టు పేసర్లను ఎదుర్కోవడంలో దిట్ట అయిన వీవీఎస్ లక్ష్మణ్‌ను.. క్రికెట్ ప్రపంచమంతా వెరీ వెరీ స్పెషల్‌గా పిలుచుకుంటుంది. అద్వితీయ పోరాటంతో భారత జట్టుకు ఎన్నో మధుర విజయాలు అందించిన ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మన్ 46వ జన్మదినం నేడు. ఈ సందర్భంగా అతడు ఆడిన కొన్ని స్పెషల్ ఇన్నింగ్స్..
విజయాల జట్టును ఓడించాడు..
వరుసగా 15 టెస్టుల్లో విజయం సాధించి ఎదురులేని జట్టుగా దూసుకెళ్తున్న ఆస్ట్రేలియా.. భారత పర్యటనకు వచ్చింది. మూడు టెస్టుల సిరీస్‌లో ముంబయిలో జరిగిన తొలి మ్యాచ్‌లో టీమ్ఇండియాపై గెలిచేసింది కంగారూ జట్టు. కోల్‌కతాలోని రెండో టెస్టులో విజయం సాధించి సిరీస్ గెలవాలని సిద్ధమైంది.
ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో పట్టుదలతో బరిలోకి దిగింది గంగూలీసేన. స్టీవ్ వా (110), హెడెన్ (97) రాణించడం వల్ల ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోరు సాధించింది. అనంతరం బరిలోకి దిగిన భారత్‌ను ఆసీస్ బౌలర్లు బెంబేలెత్తించారు. లక్ష్మణ్ (59) మినహా ఎవరూ రాణించకపోవడం వల్ల భారత్ 171 పరుగులకే కుప్పకూలింది. ఐదో స్థానంలో వచ్చిన దిగిన లక్ష్మణ్ ఆఖరి వికెట్‌గా వెనుదిరిగాడు. తొలి ఇన్నింగ్స్‌లో 274 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆసీస్.. భారత్‌ను ఫాలోఆన్ ఆడించింది.
రెండో ఇన్నింగ్స్‌ను ఆరంభించిన భారత్.. ఆదిలోనే తొలి వికెట్ కోల్పోయింది. ఇంకా రెండు రోజులకు పైగా ఆట ఉండటం వల్ల.. ఆసీస్ బౌలర్లను అడ్డుకుని మ్యాచ్‌ను కాపాడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమయంలో యాజమాన్యం ద్రవిడ్‌కు బదులుగా వన్‌డౌన్‌లో లక్ష్మణ్‌ను పంపించాలని నిర్ణయించింది. మొదటి ఇన్నింగ్స్‌లో ఆఖరి వికెట్‌గా వెనుదిరిగిన లక్ష్మణ్.. కనీసం కాళ్లకు ప్యాడ్ కూడా విప్పలేదు. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని తిరిగి మైదానంలోకి అడుగుపెట్టాడు. ఆసీస్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కుని స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు.
దాస్ (39), సచిన్ (10) వెనుదిరిగినా గంగూలీ (48)తో కలిసి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దాడు. దాదా ఔటైన తర్వాత ద్రవిడ్ (180)తో కలిసి 376 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. ఆసీస్ బౌలర్లపై విజృంభించి ద్విశతకాన్ని బాదాడు. స్కోరుబోర్డును పరుగులు పెట్టిస్తూ ట్రిపుల్ శతకాన్ని అందుకునే దిశగా పయనించాడు. కానీ మెక్‌గ్రాత్ బౌలింగ్‌లో ఔటవ్వడం వల్ల 281 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద పెవిలియన్‌కు చేరాడు. ద్రవిడ్, లక్ష్మణ్ అసాధారణమైన పోరాట ఫలితంగా భారత్ రెండో ఇన్నింగ్స్‌ను 629/7 భారీ స్కోరు వద్ద డిక్లేర్ చేసింది.
అనంతరం భారత బౌలర్లు చెలరేగడం వల్ల ఆసీస్ 212 పరుగులకే కుప్పకూలింది. ఫలితంగా టీమిండియా 171 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. అప్పట్లో ఈ మ్యాచ్ సంచలనంగా మారింది. ఫాలోఆన్‌కు దిగిన గంగూలీ సేన బలమైన ఆసీస్‌పై గెలవడం పెద్ద చర్చనీయాంశమైంది. ఆఖరి టెస్టులోనూ భారత జట్టే గెలిచి 2-1తో సిరీస్‌ను కైవసం చేసుకోవడం విశేషం.