ఐపీఎల్ కోసం ఇప్పటికే దుబాయ్ చేరుకున్న క్రికెటర్లు.. వివిధ హోటల్స్‌లో ఆరురోజుల క్వారంటైన్లో ఉన్నారు. ఈ క్రమంలోనే వారికి 1, 3, 6 రోజుల్లో కరోనా పరీక్షలు జరపనున్నారు. ఇందుకోసం వీపీఎస్ హెల్త్‌కేర్‌ను బీసీసీఐ అధికారికంగా నియమించింది. మొత్తం టోర్నీ జరిగినన్ని రోజులు, ఈ సంస్థ 20 వేలకు పైగా టెస్టులు చేయనుంది. ఈ విషయాన్ని సదరు సంస్థే ప్రకటించింది.
ఐపీఎల్లో 20 వేలకు పైగా కరోనా టెస్టులు - ఐపీఎల్ తాజా వార్తలు
ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో మొత్తంగా 20 వేలకు పైగా కరోనా టెస్టులు చేయనున్నారు. ఈ విషయాన్ని సదరు హెల్త్ కేర్ ప్రకటించింది. పరీక్షలతో పాటే ప్రత్యేక వైద్య సదుపాయలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొంది.
"ఐపీఎల్లో పాల్గొనే క్రికెటర్లతో పాటు జట్ల సహాయ సిబ్బంది, ఫ్రాంఛైజీస్, బీసీసీఐ అధికారులు, ఐపీఎల్ స్టేక్ హోల్డర్స్లకు కరోనా టెస్టులు చేయనున్నాం. వీటితో పాటే ఇతర వైద్య సదుపాయాలు సమకూర్చే విషయమై బీసీసీఐతో చర్చలు జరుపుతున్నాం" -వీపీఎస్ హెల్త్‌కేర్ ప్రకటన
సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ మ్యాచ్‌లు జరగనున్నాయి. వీటిని అబుదాబీ, షార్జా, దుబాయ్ మైదానాల్లో నిర్వహించనున్నారు. తొలి మూడు పరీక్షల్లో నెగటివ్‌గా తేలిన వాళ్లే బయో బబుల్లోనికి అడుగుపెడతారు. ఆ తర్వాత కూడా ప్రతి ఐదు రోజులకు ఓసారి అందరికీ కరోనా పరీక్షలు జరుపుతారు. పాజిటివ్‌గా తేలిన వారికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తారు.