తెలంగాణ

telangana

ETV Bharat / sports

మరపురాని మెరుపులు: వివ్​ రిచర్డ్స్​ విధ్వంసకర బ్యాటింగ్​ - 1984లో వివ్​ రిచర్డ్స్​ ఇన్నింగ్స్​

170 బంతుల్లో 189 పరుగులు.. అందులో 21 ఫోర్లు, 5 సిక్సర్లు.. ఇప్పటి టీ20 యుగంలో ఈ గణాంకాలు సాధారణంగానే కనిపించొచ్చు! కానీ 36 ఏళ్ల కిందట మాత్రం ఆ మెరుపులు ప్రపంచ క్రికెట్లో ఓ సంచలనం!. ఆ వీరుడు ఎవరో కాదు వెస్టిండీస్​ దిగ్గజ బ్యాట్స్​మన్​ వివ్​ రిచర్డ్స్​.

Viv Richards's destructive batting against England in 1984
మరపురాని మెరుపులు: వివ్​ రిచర్డ్స్​ విధ్వంసకర బ్యాటింగ్​

By

Published : May 31, 2020, 6:57 AM IST

జట్టు స్కోరు వంద దాటేసరికి ఏడుగురు బ్యాట్స్‌మెన్‌ పెవిలియన్‌ చేరిపోయిన పరిస్థితుల్లో ఆ యోధుడు.. అగ్రశ్రేణి బౌలింగ్‌ దాడిని ఎదురు నిలబడి సాగించిన విధ్వంసం ఓ చరిత్ర! ఐదు దశాబ్దాల వన్డే చరిత్రలో అత్యుత్తమ బ్యాటింగ్‌ ప్రదర్శనగా విశ్లేషకులు పేర్కొనే గొప్ప ఇన్నింగ్స్‌ అది! దాని సృష్టికర్త.. సర్‌ వివ్‌ రిచర్డ్స్‌!

ఆడుతున్నంతసేపూ నోటిలో చూయింగ్‌ గమ్‌.. బ్రేక్‌ డ్యాన్స్‌ చేస్తున్నట్లుగా ఓ లయతో కూడిన నడక.. ప్రత్యర్థి ఎవరైనా డోంట్‌ కేర్‌ అన్నట్లుగా పిచ్‌పై కదలికలు..! ఎలాంటి స్థితిలో అయినా చిరునవ్వు..! బౌలర్లతో సరదా సంభాషణలు..! ఎంత ఒత్తిడిలోనైనా ప్రశాంతత..! ఈ లక్షణాలన్నీ చెప్పగానే పాత తరం క్రికెట్‌ అభిమానులకు వెస్టిండీస్‌ దిగ్గజ ఆటగాడు వివ్‌ రిచర్డ్స్‌ గుర్తుకు రావడం సహజం! విధ్వంసక బ్యాటింగ్‌ అంటే ఏంటో క్రికెట్‌ ప్రపంచానికి పరిచయం చేసిన ఆటగాడతను. కానీ ఎంత ధాటిగా షాట్‌ ఆడినో అందులో తనదైన 'స్టైల్‌' చూపించడం రిచర్డ్స్‌కే చెల్లు. హెల్మెట్‌లు లేని రోజుల్లో ఒంటి మీదికి దూసుకొచ్చే బంతుల్ని రిచర్డ్స్‌ హుక్‌ చేసే తీరు చూసి తీరాల్సిందే! కెరీర్లో ఎన్నో మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడినప్పటికీ.. 1984లో అప్పటికి వన్డేల్లో అత్యధిక స్కోరు నమోదు చేసిన ఇన్నింగ్స్‌ ఎంతో ప్రత్యేకం.

పెవీలియన్​ బాటలో..

1983 వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో భారత్‌ చేతిలో కంగుతిన్న ఏడాది తర్వాత.. ఇంగ్లాండ్‌ పర్యటనకు వెళ్లింది వెస్టిండీస్‌. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఓల్డ్‌ ట్రాఫోర్డ్‌లో తొలి మ్యాచ్‌. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కరీబియన్‌ జట్టుకు షాక్‌ల మీద షాక్‌లు. పేస్‌ త్రయం విలిస్‌, బోథమ్‌, ఫోస్టర్‌ల ధాటికి టాప్‌ ఆర్డర్‌ కకావికలమైంది. నాలుగో స్థానంలో రిచర్డ్స్‌ దిగేటప్పటికి విండీస్‌ చేసింది 11 పరుగులే. రిచర్డ్స్‌ వచ్చాక కూడా పతనం ఆగలేదు. అతను చాలా సునాయాసంగా ఇంగ్లాండ్‌ బౌలర్లను ఎదుర్కొంటున్నాడు. అవతల వికెట్లు పడుతూనే ఉన్నాయి. 26వ ఓవర్లో వెస్టిండీస్‌ స్కోరు 100 దాటేసరికి ఏకంగా ఏడు వికెట్లు పడిపోయాయి. గ్రీనిడ్జ్‌, హేన్స్‌, రిచీ రిచర్డ్‌సన్‌, లారీ హోమ్స్‌, లాయిడ్‌.. ఇలా హేమాహేమీలందరూ పెవిలియన్‌ చేరిపోయారు. ఏడో వికెట్‌ పడే సమయానికి రిచర్డ్స్‌ 65 పరుగులతో అజేయంగా ఉన్నాడు. అప్పుడు అతడికి బాప్టిస్ట్‌ (26) తోడయ్యాడు. వికెట్ల పతనానికి కొంచెం అడ్డుకట్ట పడింది. ఇద్దరూ కలిసి జట్టు స్కోరును 150 దాటించారు. అంతలో మళ్లీ కుదుపు. రెండు వికెట్లు పడ్డాయి. స్కోరు 166/9. చివరి బ్యాట్స్‌మన్‌ హోల్డింగ్‌ క్రీజులోకి వచ్చాడు. ఈ వికెట్‌ పడగొట్టడం ఎంతసేపు అనుకున్నారు ఇంగ్లిష్‌ బౌలర్లు. కానీ హోల్డింగ్‌తో కలిసి రిచర్డ్స్‌ ఇంగ్లాండ్‌కు పెద్ద షాకే ఇచ్చాడు.

ఇంగ్లాండ్​ వ్యూహాలను తిప్పికొడుతూ..

తొమ్మిదో వికెట్‌ పడే సమయానికి రిచర్డ్స్‌ స్కోరు 96. బోథమ్‌ బౌలింగ్‌లో ఓ మెరుపు షాట్‌తో అతడి శతకం పూర్తయింది. సెంచరీకి 112 బంతులు తీసుకున్నాడు వివ్‌. ఏ క్షణమైనా వికెట్‌ పడొచ్చు. అప్పటిదాకా సాధ్యమైనన్ని పరుగులు రాబడదాం అన్నట్లుగా విధ్వంసక అవతారం ఎత్తాడు రిచర్డ్స్‌. ఇక అక్కడి నుంచి మెరుపులే మెరుపులు. లెగ్‌ ఫ్లిక్‌లు, హుక్‌లతో సునాయాసంగా పరుగులు రాబడుతున్నాడని.. ఇంగ్లిష్‌ కెప్టెన్‌ ఎక్కువమందిని అటు వైపే ఉంచాడు. కాళ్ల మీదికి బంతులు వేయించాడు. ఈ వ్యూహాన్ని రిచర్డ్స్‌ తిప్పికొట్టిన వైనం అమోఘం. వికెట్లు మొత్తం వదిలి లెగ్‌ స్టంప్‌కు అవతల పడుతున్న బంతుల్ని కవర్స్‌లో బౌండరీకి మళ్లించి వారెవా అనిపించాడు. అప్పట్లో బౌండరీల దూరం ఎక్కువ. అందులోనూ కవర్స్‌లో మరీ దూరం. ఆ ప్రదేశంలో రిచర్డ్స్‌ ఓ కళ్లు చెదిరే ఫ్లాట్‌ సిక్సర్‌తో అబ్బురపరిచాడు. హోల్డింగ్‌ను కాచుకుంటూనే స్వేచ్ఛగా షాట్లు ఆడుతూ పరుగుల వరద పారించాడు రిచర్డ్స్‌. వెస్టిండీస్‌ ఇంకో వికెట్‌ కోల్పోకుండానే 272/9తో ఇన్నింగ్స్‌ను ముగించింది.

ఇంగ్లాండ్‌ను 168 పరుగులకే కుప్పకూల్చి, 104 పరుగుల తేడాతో విజయాన్నందుకుంది. విండీస్‌ ఇన్నింగ్స్‌లో చివరి వికెట్‌ భాగస్వామ్యం 106 కాగా.. అందులో వివ్‌ వాటానే 93. మొత్తం 170 బంతులెదుర్కొన్న రిచర్డ్స్‌ 189 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఏడాది కిందట కపిల్‌ దేవ్‌ (175) నెలకొల్పిన అత్యధిక స్కోరు రికార్డును బద్దలు కొట్టాడు. 1997లో సయీద్‌ అన్వర్‌ 194 పరుగులు చేసే వరకు రిచర్డ్స్‌ రికార్డు నిలిచి ఉంది. వన్డే చరిత్రలో ఇంకా పెద్ద స్కోర్లు స్కోర్లున్నాయి. విధ్వంసక ఇన్నింగ్స్‌లున్నాయి. కానీ అప్పటి పరిస్థితుల్లో రిచర్డ్స్‌ సాగించిన పోరాటం, అగ్రశ్రేణి బౌలర్లపై చూపించిన ఆధిపత్యం మాత్రం అసామాన్యం. అందుకే దీన్ని విశ్లేషకులు అత్యుత్తమ వన్డే ఇన్నింగ్స్‌గా పరిగణిస్తారు!

బ్యాట్స్​మన్​: వివ్​ రిచర్డ్స్​

పరుగులు: 189 నాటౌట్​

బంతులు: 170

బౌండరీలు: ఫోర్లు 21, సిక్సర్లు 5

ప్రత్యర్థి: ఇంగ్లాండ్​

ఫలితం: 104 పరుగులతో విండీస్​ విజయం

సంవత్సరం: 1984

ఇదీ చూడండి... వ్యాక్సిన్ వస్తే అంతా మారిపోతుంది: గంగూలీ

ABOUT THE AUTHOR

...view details