చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై వీరూ ఆడిన ఆ ఇన్నింగ్స్‌ను అభిమానులెప్పటికీ మరిచిపోలేరు. హైలైట్స్‌ను చూస్తున్నామా అన్న భావన కలిగించిన అతడు తన త్రిశతకం (309)తో పాక్ గడ్డపై భారత్‌కు మొట్టమొదటి టెస్టు విజయాన్ని అందించాడు. 375 బంతుల పాటు సాగిన అతడి ఊచకోతలో 39 ఫోర్లు, 6 సిక్స్‌లు ఉన్నాయి. ముఖ్యంగా సక్లయిన్ ముస్తాక్ బౌలింగ్‌లో సిక్స్‌తో అతడు మూడొందలకు చేరుకున్న తీరు అద్భుతం. వీరూ జోరుతో మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో భారత్ ఇన్నింగ్స్ 52 పరుగుల తేడాతో పాక్‌ను చిత్తు చేసింది. సెహ్వాగ్‌తో పాటు సచిన్ (194 నాటౌట్) చెలరేగడం వల్ల తొలి ఇన్నింగ్స్‌ను 675/5 వద్ద డిక్లేర్ చేసిన భారత్.. పాకిస్థాన్‌ను తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులకు, రెండో ఇన్నింగ్స్‌లో 216 పరుగులకే ఆలౌట్ చేసింది.
పాకిస్థాన్‌కు పీడకలలను మిగిల్చిన ముల్తాన్ టెస్టు.. భారత అభిమానులకు మాత్రం ఎప్పుడు తలచుకున్నా సంతోషాన్నిచ్చే అనుభూతులను ఇచ్చింది. సహజంగానే భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ అంటే ఎంతో ఆసక్తి, ఉత్కంఠ ఉంటాయి. కానీ 2004లో పాకిస్థాన్‌లో భారత పర్యటనకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. ఎందుకంటే 1989-90 తర్వాత ఆ దేశానికి వెళ్లడం టీమ్ ఇండియాకు అదే తొలిసారి. అంతకుముందెప్పుడూ పాక్‌లో భారత్ టెస్టు మ్యాచ్ నెగ్గలేదు. హోరాహోరీ వన్డే సిరీస్‌ను 3-2తో గెలిచి తొలి టెస్టులో అడుగుపెట్టింది ద్రవిడ్ నేతృత్వంలోని భారత జట్టు. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. షోయబ్ అక్తర్, మహ్మద్ సమి, సక్లయిన్ ముస్తాక్ లాంటి స్టార్ బౌలర్లున్న పాకిస్థాన్ ధీమాగానే దిగింది. కానీ పెను తుఫాను ముంచేయబోతోందని ఊహించలేకపోయింది. ఆకాశ్ చోప్రాతో కలిసి ఇన్నింగ్స్ ఆరంభించిన వీరూ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా తన స్ట్రోక్ ప్లేతో పరుగుల వరద పారించాడు. పెద్దగా ఫుట్‌వర్క్ లేకపోయినా.. చక్కని కంటి, చేతి సమన్వయంతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు.