టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ తీరుపై భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించాడు. ఆస్ట్రేలియాతో శుక్రవారం జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో శ్రేయస్ అయ్యర్‌ను తుది జట్టులో ఎందుకు తీసుకోలేదని ప్రశ్నించాడు.
"శ్రేయస్ అయ్యర్ తాను చివరిగా ఆడిన టీ20 సిరీస్‌లో మెరుగైన ప్రదర్శన కనబర్చాడు. మరి ఏ కారణంతో తొలి టీ20లో అతడిని కోహ్లీ తీసుకోలేదు? 'నన్నెందుకు తీసేశావు' అని కోహ్లీని అడిగే ధైర్యం శ్రేయస్‌కు ఉండదు.. ఎందుకంటే కోహ్లీ భారత కెప్టెన్‌గా ఉన్నాడు. ముఖ్యంగా కోహ్లీ గురించి ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. టీమ్ఇండియాలో ఉన్న ఆటగాళ్లందరికీ నిబంధనలు వర్తిస్తాయి.. ఒక్క కోహ్లీకి తప్ప. ఎందుకు అతని విషయంలో మాత్రం రూల్స్‌ను పట్టించుకోరు. అతనికి నచ్చినట్లుగా బ్యాటింగ్ ఆర్డర్‌ని మారుస్తాడు.. ఆటగాళ్లపై వేటు వేస్తాడు.. ఫామ్‌లో లేని ఆటగాళ్లకు అవకాశాలిస్తుంటాడు. ఇలా చేయడం తప్పు. కోహ్లీ తన పద్దతిని మార్చుకుంటే మంచిది."