వీరేంద్ర సెహ్వాగ్.. కోట్లాది మంది భారతీయులకు అభిమాన క్రికెటర్. ఈ మాజీ ఆటగాడు బ్యాట్ ఝుళిపిస్తే మంత్రముగ్దులవని వారు ఉండరేమో! అతడు బ్యాట్ పడితే బంతి బౌండరీ దాటాల్సిందే. క్రీజులో ఉంటే బౌలర్లకు వణుకు పుట్టాల్సిందే. బౌలర్ ఎవరైనా స్కోరు బోర్డు పరుగులు పెట్టాల్సిందే. మైదానంలో బ్యాటింగ్ చేసినా.. ట్విటర్‌లో పంచ్‌లు విసిరినా అది వీరేంద్రుడికే చెల్లింది. ఓ బ్యాట్స్‌మన్‌గా ఎంత దూకుడుగా ఉంటాడో, ఒక నెటిజన్‌గా అంతే చురుగ్గా ఉంటాడు. తన బ్యాట్‌తో బౌండరీ బాదినంత తేలిగ్గా ట్విట్టర్లో పంచులు విసురుతుంటాడు. కరోనాపై ఈ క్రికెటర్ సందేశాత్మకంగా, ఛలోక్తులతో ట్వీట్లు చేశాడు వాటిపై లుక్కేద్దాం..
అందరి నుంచి అభినందనలే
కరోనా వ్యాప్తిని నిర్మూలించడం కోసం పనిచేస్తున్న హీరోలకు.. టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ధన్యవాదాలు చెప్పాడు. "అవిరామంగా పనిచేస్తున్న యోధులందరికీ పెద్ద వందనం. భవిష్యత్తులో పరిస్థితులు సర్దుకుంటాయని ఆశిస్తున్నా. ఓం శాంతి" అని ట్వీట్ చేశాడు. ఆ తర్వాత రియల్ హీరోలకు కృతజ్ఞతగా చప్పట్లు కొట్టే కార్యక్రమంలో భాగంగా చిన్నపాటి వీడియో షేర్ చేయగా... అది నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంది. చెత్త ఏరుకునే చదువులేని ఓ వ్యక్తి, కరోనాపై పోరాటం చేస్తున్నవారిని అభినందిస్తున్నట్లు పరోక్షంగా చెప్పాడు.