భవిష్యత్తు గురించి మనలో చాలా మంది సతమతమవుతూ ఉంటారు. ఎవరిని వారు ప్రశ్నించుకొని ముందుకు సాగితే ఎలాంటి అభద్రతా భావం ఉండదు. ముఖ్యంగా టీనేజీ వయసులో పిల్లలు అభద్రతా భావానికి గురికాకుండా... ఆ వయసులో ఉన్నప్పుడు తను ఎలా ఆలోచించోవాడో తలుచుకుంటూ భవిష్యత్తు గురించి తనకు తాను భరోసానిస్తూ లేఖ రాసుకున్నాడు కోహ్లీ. అప్పటి విరాట్‌కు రాసిన ఆ స్వీయ సందేశాన్ని ఈ రోజు తన పుట్టినరోజు సందర్భంగా ట్విట్టర్లో పంచుకున్నాడు రన్‌మెషిన్.
విరాట్ స్వీయ సందేశం..
"హాయ్ చీకూ.. ముందుగా నీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. నాకు తెలుసు భవిష్యత్తు గురించి నిన్ను చాలా ప్రశ్నలు వేధిస్తున్నాయని. ఎక్కువ సందేహాలను ఇప్పుడు నేను నివృత్తి చేయలేను అందుకు నన్ను క్షమించు. ఎందుకంటే ప్రతి సర్ప్రైజ్ బావుంటుంది.. ప్రతి సవాల్ థ్రిల్లింగ్‌గా ఉంటుంది.. నిరాశ చెందిన ప్రతిసారి నేర్చుకోవడానికి అవకాశం దొరుకుతుంది. ఈ రోజు ఇది నీకు అర్థం కాకపోవచ్చు. నీ గమ్యం కోసం వెళ్లే ప్రయాణంలో నీకే తెలుస్తుంది. ఆ మజిలీ ఎంతో అద్భుతంగా ఉంటుందని.
జీవితంలో ఎన్నో విషయాలను, జ్ఞాపకాలను దాచుకోవాలి.. అదే నీకు నేను చెబుతున్నా. నీ ప్రయాణంలో నీకొచ్చే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు నువ్వు సిద్ధంగా ఉండాలి. అందరిలా నువ్వూ విఫలమవుతావ్. తిరిగి ఎదిగేందుకు ప్రయత్నించడాన్ని మాత్రం మర్చిపోకు. ఒకసారి ఓడితే మళ్లీ మళ్లీ ప్రయత్నించు. భవిష్యత్తులో నిన్ను ఎంతో మంది ఇష్టపడతారు. కొంతమందికి నువ్వంటే ఇష్టం లేకపోవచ్చు. నీకు తెలియని వాళ్లు ఏమన్నా నువ్వు పట్టించుకోవద్దు. నిన్ను నువ్వు నమ్ము!