టీమ్ఇండియా సారథి విరాట్ కోహ్లీ ఇటీవలి ప్రదర్శన అభిమానులను తీవ్రంగా కలవరపెడుతోంది. ఒకప్పుడు పరుగుల వరద పారించిన విరాట్.. సెంచరీ కొట్టి చాలా నెలలు గడిచిపోయింది. దీనికి తోడు.. ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో డకౌట్‌గా వెనుదిరిగాడు కోహ్లీ. ఆడిన చివరి 5 ఇన్నింగ్స్‌ల్లో మూడు సార్లు డకౌట్ అయ్యాడు. ఇది మరింత ఆశ్చర్యానికి గురిచేసే విషయం.
తడబడుతూ..
గత కొన్ని ఇన్నింగ్స్‌ల్లో భారీ స్కోరు చేయడంలో కోహ్లీ విఫలమవుతున్నాడు. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన రెండో టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో కోహ్లీ ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. చివరి టెస్టులో భారత్ ఘన విజయం సాధించి సిరీస్ నెగ్గినా.. కోహ్లీ విషయంలో నిరాశే మిగిలింది. ఆ టెస్టులో భారత్ ఆడిన ఒకే ఒక్క ఇన్నింగ్స్‌లోనూ డకౌట్ అయ్యాడు విరాట్. ఇంగ్లాండ్‌తో తొలి టీ20లోనూ మొదటి నాలుగు బంతులు అతికష్టంగా ఎదుర్కొన్న అతను ఐదో బంతికి డకౌట్‌గా వెనుదిరిగాడు. ఈ నేపథ్యంలో విరాట్ వరుస డకౌట్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
భారత అభిమానులను ఈ విషయం కలవరపెడుతుంటే.. ప్రత్యర్థి జట్లు మాత్రం ఊపిరిపీల్చుకుంటున్నాయి. వీలైనంత త్వరగా కోహ్లీని ఔట్ చేయడం మా జట్టుకు బోనస్ లాంటిది అని ఇంగ్లాండ్ పేసర్ ఆర్చర్ అన్నాడు.