వికెట్లు పడుతున్నా పరుగులెలా చేయాలో విరాట్ కోహ్లీని చూసి నేర్చుకోవాలని వీవీఎస్ లక్ష్మణ్ యువ క్రికెటర్లకు సూచించాడు. ఇంగ్లాండ్‌తో మూడో టీ20లో కెప్టెన్ ఇన్నింగ్స్ అద్భుతమని ప్రశంసించాడు. ఒక పక్క భాగస్వామ్యాలు నిర్మిస్తూనే స్కోరు వేగం పెంచాడని తెలిపాడు. ఈ మ్యాచులో తొలి 29 బంతుల్లో 28 పరుగులు చేసిన విరాట్ తర్వాత 17 బంతుల్లోనే 49 పరుగులు సాధించాడు.
"ఒకానొక దశలో టీమ్‌ఇండియా కనీసం 140 పరుగులైనా చేస్తుందా అన్న సందేహం కలిగింది. ఎందుకంటే మొదట్లోనే ఎక్కువ వికెట్లు పడ్డాయి. కానీ కోహ్లీ విజృంభించాడు. ఛేదన రారాజు ఆదివారమే తన మాయాజాలం ప్రదర్శించినా మూడో టీ20లో ఇన్నింగ్స్ మాత్రం అత్యంత గొప్పది. తొలుత ఒత్తిడిని అధిగమించాడు. భాగస్వామ్యాలు నిర్మించాడు. తర్వాత దూకుడుగా ఆడాడు. ఒత్తిడిలో బ్యాటింగ్ ఎలా చేయాలో? పరుగులు ఎలా సాధించాలో? అతడిని చూసి యువకులు నేర్చుకోవాలి."