భారత్-దక్షిణాఫ్రికా జట్ల మధ్య జరుగుతోన్న రెండో టెస్టులో భారత ఆటగాళ్లు ఫీల్డింగ్‌లోనూ తమ ఆధిపత్యం ప్రదర్శించారు. శనివారం ఓవర్‌నైట్ స్కోర్ 36/3తో తొలి ఇన్నింగ్స్‌ను కొనసాగించిన దక్షిణాఫ్రికా... మ్యాచ్ ప్రారంభమైన అరగంటకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. అద్భుతమైన క్యాచ్‌లతో సఫారీ బ్యాట్స్‌మెన్‌ను పెవిలియన్ చేర్చారు కోహ్లీ, సాహా.
వావ్ అనిపించేలా...
భారత పేసర్ షమి వేసిన మూడో ఓవర్‌లో నైట్‌వాచ్‌మెన్ నోర్జె (3) నాలుగో స్లిప్‌లో ఉన్న కోహ్లీ చేతికి చిక్కాడు. కుడివైపు నుంచి కిందగా వెళ్తున్న బంతిని డైవ్‌చేస్తూ చక్కటి క్యాచ్ అందుకున్నాడు టీమిండియా సారథి. కాసేపటికే ఉమేశ్‌యాదవ్ బౌలింగ్‌లో డిబ్రుయిన్ (30) కీపర్ చేతికి చిక్కాడు. ఔట్‌సైడ్ ఎడ్జ్ తీసుకున్న బంతి తొలి స్లిప్‌లో దూసుకెళ్లినా వికెట్‌కీపర్ సాహా... అమాంతం డైవ్‌చేస్తూ అదిరిపోయే క్యాచ్ అందుకున్నాడు. ఇప్పటికే రిషభ్ పంత్‌కు బదులు సాహా బెస్ట్ అన్న యాజమాన్యం అభిప్రాయాన్ని మరోసారి నిజం చేశాడీ బంగాల్ కీపర్.