కొత్త ఏడాదిలో లంకపై సిరీస్ గెలిచి జోరు మీదున్న టీమిండియా.. ప్రస్తుతం అన్ని ఫార్మాట్లలోనూ టాప్‌లోకి దూసుకెళ్లాలని భావిస్తోంది. ఇప్పటికే కోహ్లీసేనకు సరైన సమఉజ్జీలు దొరకలేదు. అయితే ఈ నెల 24 నుంచి న్యూజిలాండ్‌తో, ఆ తర్వాత నవంబర్‌లో ఆస్ట్రేలియాలో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేందుకు ఆ దేశాలకు వెళ్లనుంది మెన్ ఇన్ బ్లూ.
ఆసీస్‌తో సిరీస్‌కు ఎంతో సమయం ఉన్నప్పటికీ మాజీ క్రీడాకారులు అప్పుడే ఈ విషయంపై ఆసక్తి చూపుతున్నారు. సిరీస్ అత్యంత ఆసక్తికరంగా సాగుతుందనడంలో సందేహం లేదని దిగ్గజ ఆటగాడు స్టీవ్ వా అభిప్రాయపడ్డాడు.
"భారత్, ఆస్ట్రేలియా తలపడే సిరీస్ ఏదైనా గొప్పదే. ఇదో సంప్రదాయంగా మారింది. 2020 చివర్లో పర్యటనపైఅప్పుడే ఆసక్తి పెరిగిపోతోంది. స్మిత్, వార్నర్ వల్ల మా జట్టు మరింత బలపడింది. కోహ్లీసేన అన్ని విభాగాల్లో ప్రపంచంలోనే అగ్రగామి అనడంలో సందేహం లేదు. అందుకే ఈ సిరీస్ చిరకాలం గుర్తుండిపోతుంది. ఆస్ట్రేలియాలో గులాబి టెస్టు ఆడటం సవాలే. విరాట్ లాంటి ఆటగాడు దానిని స్వాగతిస్తాడు. ప్రపంచంలోని అత్యుత్తమ జట్టు ఏదైనా పరిస్థితులు, ప్రదేశంతో సంబంధంతో లేకుండా గెలవాలనే కోరుకుంటుంది. భారత్ అందుకు మినహాయింపేమీ కాదు"
-- స్టీవ్ వా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
కంగారూలతో భారత్ కచ్చితంగా గులాబి మ్యాచ్ ఆడుతుందని ధీమా వ్యక్తం చేశాడు స్టీవ్ వా. ఆస్ట్రేలియా జట్టులో స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్ రాకతో పోటీ రసవత్తరంగా ఉంటుందని అంచనా వేస్తున్నాడు.
" రెండు జట్లు కఠినమైన క్రికెట్ ఆడుతున్నాయి. ఆస్ట్రేలియాకు ఉత్సాహకరమైన లైనప్ ఉంది. లబుషేన్ వంటి కొత్త ఆటగాళ్లు దొరికారు. స్మిత్, వార్నర్ బాల్ ట్యాంపరింగ్ ఉదంతం తర్వాత ఆసీస్ చాలా వేగంగా, బలంగా పుంజుకుంది. భారత్‌లో కోహ్లీసేనను ఓడించడం వారిలో ఆత్మవిశ్వాసం నింపింది. ఐసీసీ టోర్నీలు కైవసం చేసుకోవడం సులభం కాదు. ఏ టోర్నీలోనైనా వారు గట్టి పోటీదారులు. భారత్‌కు వాటిని సాధించే సామర్థ్యం ఉంది"
-- స్టీవ్ వా, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్
ఈ ఏడాది నవంబర్ 23 నుంచి వచ్చే ఏడాది జనవరి 12 వరకు భారత్-ఆస్ట్రేలియా మధ్య పలు ద్వైపాక్షిక సిరీస్‌లు జరగనున్నాయి. ఇందులో భాగంగా 4 టెస్టులు, 3 వన్డేలు ఆడనున్నాయి ఇరుజట్లు. ఇందులో గులాబి టెస్టు మ్యాచ్‌లనూ నిర్వహించాలని బీసీసీఐని కోరుతోంది ఆసీస్ క్రికెట్ బోర్డు.
ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదనను వ్యతిరేకించాడు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్ స్టీవ్ వా. ఐదు రోజుల మ్యాచ్‌ల్లోనే ఆటగాళ్ల సామర్థ్యం, నైపుణ్యాలను అత్యుత్తమంగా పరీక్షించొచ్చని అన్నాడు. టెస్టుల్లో ఉత్కంఠకర, అద్భుతమైన మ్యాచుల్ని ఎన్నోచూశామని గుర్తుచేసుకున్నా ఆయన.. వాటి నిడివిని మార్చకుండా అలాగే వదిలేయాని సూచించాడు. ఇప్పటికే ఈ అంశంపై సచిన్, కోహ్లీ, గంభీర్, టీమిండియా కోచ్ రవిశాస్త్రి వ్యతిరేకించారు. విదేశీ ఆటగాళ్లు, మాజీలు సైతం ఐసీసీ ప్రతిపాదనపై విమర్శలు గుప్పించారు.