ఇప్పటికే ఎన్నో రికార్డులను కైవసం చేసుకున్న టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ.. మరికొన్ని ఘనతలకు అడుగు దూరంలో ఉన్నాడు. బంగ్లాదేశ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో విరాట్.. బ్యాట్ ఝుళిపిస్తే ఈ రికార్డులను అందుకునే అవకాశముంది.
టెస్టు సారథిగా రికార్డు..
టెస్టుల్లో విరాట్ ఇంకో 157 పరుగులు చేస్తే 5 రోజుల ఫార్మాట్లో టీమిండియా సారథుల్లో అత్యధిక పరుగులు చేసిన కెప్టెన్ సౌరభ్ గంగూలీ రికార్డును అధిగమిస్తాడు. గంగూలీ 113 మ్యాచ్‌ల్లో 7,212 పరుగుల చేయగా.. కోహ్లీ 82 టెస్టుల్లోనే 7,066 పరుగులు చేసి దాదా తర్వాత ఉన్నాడు.
గంగూలీ రికార్డుకు చేరువలో..
దీర్ఘకాలిక ఫార్మాట్లో అత్యధిక పరుగులు చేసిన భారత క్రికెటర్లలో ప్రస్తుతం విరాట్ 7వ స్థానంలో ఉన్నాడు. కోహ్లీ కంటే ముందు సచిన్ తెందూల్కర్(15,921), రాహుల్ ద్రవిడ్(13,288), సునీల్ గావస్కర్(10,122), వీవీఎస్ లక్ష్మణ్(8,718), వీరేంద్ర సెహ్వాగ్(8,586), గంగూలీ (7,212)ఉన్నారు. వీరేకాకుండా క్రిస్ గేల్(8,214), స్టీఫెన్ ఫ్లెమింగ్(7,172), గ్రెగ్ చాపెల్(7,110) రికార్డులనూ అందుకునే అవకాశముంది.
అడుగు దూరంలో బోర్డర్ రికార్డు..
ఇంకో టెస్టులో విజయం సాధిస్తే ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ అలెన్ బోర్డర్ రికార్డును బద్దలు కొడతాడు విరాట్. ఇప్పటివరకు 51 మ్యాచ్‌లకు సారథ్యం వహించిన కోహ్లీ.. 31 విజయాలు అందించాడు. బోర్డర్.. 91 టెస్టుల్లో 32 మ్యాచ్‌లను గెలిపించాడు. అత్యధిక విజయాలందుకున్న టెస్టు సారథిగా గ్రేమ్ స్మిత్(53) అగ్రస్థానంలో ఉన్నాడు. అనంతరం స్టీవ్ వా(51), క్లైవ్ లాయడ్(36) తర్వాతి స్థానాల్లో ఉన్నారు.
ఇండోర్‌లో రెండోది..
గురువారం ఇండోర్ హోల్కర్ స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. ఇప్పటివరకు అక్కడ ఒకే ఒక్కసారి టెస్టు మ్యాచ్ నిర్వహించారు. 2016లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, పుజారా సెంచరీలు చేసి భారత్‌ను 321తేడాతో గెలిపించారు.
ఈ ఏడాది టెస్టుల్లో శతకం చేయని విరాట్ కోహ్లీ.. ఇటీవల దక్షిణాఫ్రికాతో జరిగిన టెస్టు సిరీస్‌లో డబుల్ శతకం సాధించి పరుగుల దాహం తీర్చుకున్నాడు. ఇప్పుడు బంగ్లాదేశ్‌తో జరగనున్న సిరీస్‌లోనూ విరాట్ పరుగల ప్రవాహాన్ని పారించాలని అభిమానులుఆశిస్తున్నారు.
ఇదీ చదవండి: రోహిత్‌శర్మ '264' మైలురాయికి ఐదేళ్లు