ప్రస్తుత క్రికెటర్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఎక్కువ ప్రజాదరణ ఉందని ఎన్నో అధ్యయనాలు తేల్చాయి. భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా అతడికి అభిమానులు ఉన్నారు. అతడ్ని కలవాలని, కుదిరితే కలిసి ఫొటోలు దిగాలని ఎంతోమంది ప్రయత్నిస్తుంటారు. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనూ అభిమానులు మైదానంలోకి దూసుకొచ్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ కూడా తాము కూడా కోహ్లీకి ఫ్యాన్స్ అని తెలిపింది. విరాట్‌తో కలిసి ఫొటో దిగాలనుకున్న తమ కల నెరవేరిందని ట్వీట్ చేసింది. అది ఎలా సాధ్యమైందంటే..
'విరాట్ సెల్ఫీ మా కల నెరవేర్చింది' - విరాట్ సెల్ఫీ
ప్రపంచంలోనే అత్యంత ఫాలోయింగ్ ఉన్న క్రికెటర్లలో విరాట్ కోహ్లీ ఒకరు. మరి అలాంటి ఆటగాడితో సెల్ఫీ దిగితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేనిది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌లో అదే తరహా సంతోషం వ్యక్తం చేసింది. ఇందుకు కారణం తెలియాలంటే ఈ కథనం చదవండి..
ప్రస్తుతం సిడ్నీలో ఉన్న కోహ్లీ క్వారంటైన్ నిబంధనలు పాటిస్తూ ఆస్ట్రేలియా పర్యటనకు సన్నద్ధమవుతున్నాడు. క్వారంటైన్‌ను ఆస్వాదిస్తున్నానని, సౌకర్యవంతమైన మంచం, చూడటానికి మంచి వెబ్‌సిరీస్‌లు ఉన్నాయని పేర్కొంటూ విరాట్ తన సెల్ఫీని మంగళవారం ట్వీట్ చేశాడు. అయితే ఫొటోలో ఉన్న ల్యాప్‌టాప్‌లో నెట్‌ఫ్లిక్స్‌లోని వెబ్‌సిరీస్‌లు కనిపించాయి. ఫలితంగా కోహ్లీ ట్వీట్‌ను నెట్‌ఫ్లిక్స్ ఇండియా రీట్వీట్ చేస్తూ పోస్ట్ చేసింది.
"ఆ కంప్యూటర్ తెరపై మేం ఉన్నాం. విరాట్ కోహ్లీతో కలిసి ఫొటో దిగాలనుకున్న మా కల నెరవేరింది" అని ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఇది నెట్టింట్లో వైరల్‌గా మారింది.