ఆక్లాండ్‌లో టీమిండియాతో జరిగిన రెండో వన్డేలో కివీస్ విజయం సాధించింది. వరుసగా రెండో మ్యాచ్‌లోనూ గెలిచి, 2-0 తేడాతో సిరీస్‌ను సొంతం చేసుకుంది. అనంతరం ఈ ఓటమిపై స్పందించాడు భారత సారథి విరాట్ కోహ్లీ. మ్యాచ్ ముగించిన తీరు సంతృప్తినిచ్చిందని అన్నాడు.
కివీస్‌పై ఓడినా సంతృప్తిగానే ఉన్నాం: కోహ్లీ - భారత్ న్యూజిలాండ్ రెండో వన్డే
న్యూజిలాండ్‌తో రెండో వన్డేలో టీమిండియా ఓడిపోయింది. అనంతరం ఈ ఓటమిపై స్పందించాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. అయితే మ్యాచ్‌ను ముగించిన తీరు సంతృప్తినిచ్చిందని అన్నాడు.
"రెండు మ్యాచ్‌లు అభిమానులను అలరించాయి. మ్యాచ్ ముగించిన తీరు పట్ల సంతృప్తిగా ఉన్నా. కివీస్ మొదట 197 పరుగులకే 8 వికెట్లు కోల్పోయినా.. 270 పైగా పరుగులు చేసింది. దీనిని బట్టి చూస్తే మేం చాలా అవకాశాల్ని వదులుకున్నామని చెప్పుకోవాలి. కానీ లక్ష్య చేధనలో పోరాడం. సైనీ, జడేజా గొప్పగా బ్యాటింగ్ చేశారు. శ్రేయస్ బాగా ఆడాడు. టెస్టులు, టీ20లతో పోలిస్తే ఈ ఏడాది వన్డేలకు అంత ప్రాధాన్యం ఇవ్వట్లేదు. కానీ ఈ ఫార్మాట్లో ఒత్తిడిని జయించి, పోరాడే ఆటగాళ్ల కోసం వెతుకుతున్నాం. ఇంకా కోల్పోవడానికి ఏం లేదు కాబట్టి చివరి మ్యాచ్‌లో మార్పులు చేస్తాం. ఫలితం గురించి అంతగా బాధపడట్లేదు."
-విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన కివీస్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 273 పరుగులు చేసింది. గప్తిల్ (79), టేలర్ (73) అర్ధశతకాలతో రాణించారు. అనంతరం బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన.. 48.3 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌటైంది. శ్రేయస్ అయ్యర్ (52), జడేజా (55) అర్ధశతకాలతో ఆకట్టుకోగా, నవదీప్ సైనీ 45 పరుగులతో మెరిశాడు. ఓ సమయంలో 153 పరుగులకే ఏడు వికెట్లు కోల్పోగా.. సైనీ, జడేజా ఆదుకున్నారు.