టీమ్ఇండియా.. 2011లో వన్డే ప్రపంచకప్ గెలుచుకుంది. దాదాపు 28 ఏళ్ల తర్వాత మెగాటోర్నీలో విజేతగా నిలిచింది. అయితే ఫైనల్ల్లో గెలిచిన అనంతరం మాస్టర్ బ్లాస్టర్ సచిన్ తెందుల్కర్‌ను భుజాలపై ఎత్తుకుని వాంఖడే మైదానం మొత్తం తిప్పారు భారత క్రికెటర్లు. అలా చేయడం వెనుకున్న కారణాన్ని వెల్లడించాడు ప్రస్తుత కెప్టెన్ కోహ్లీ. మరో క్రికెటర్ మయాంక్ అగర్వాల్‌తో జరిగిన చాట్ సెషన్లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.
"ప్రపంచకప్ గెలిచినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. కానీ, స్టేడియంలో అందరీ దృష్టి సచిన్‌పైనే ఉంది. ఎందుకంటే అతడి చివరి ప్రపంచకప్ అది. ఇన్నేళ్లుగా దేశం కోసం ఆడాడు. చాలాసార్లు జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. జట్టులో యువ ఆటగాళ్లకు స్ఫూర్తిగా నిలిచాడు. సొంత మైదానంలో ఆడుతూ, ట్రోఫీ గెలిచిన ఆ సమయంలో మాస్టర్‌కు అలాంటి గౌరవం దక్కాలని జట్టు సభ్యులందరం భావించాం. ఆ తర్వాత సచిన్‌ను ఎత్తుకుని గౌరవంగా తిప్పాం"