టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీకి మరో పేరు పరుగుల యంత్రం. ప్రస్తుత క్రికెట్‌లో ఆల్‌టైమ్ అత్యుత్తమ బ్యాట్స్‌మన్. ఏడాదికి కనీసం నాలుగైదు సెంచరీలు సాధించే ఘనుడు. అలాంటిది 16 నెలలుగా కనీసం ఒక్క ఫార్మాట్‌లోనూ మూడంకెల స్కోర్ అందుకోలేకపోయాడు. ఈ నేపథ్యంలో నేటి నుంచి ఇంగ్లాండ్‌తో ప్రారంభమయ్యే తొలి టెస్టులోనైనా శతకం సాధించాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
చివరగా కోహ్లీ 2019 నవంబర్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన తొలి డే/నైట్ టెస్టులో మూడంకెల స్కోర్ సాధించాడు. ఆపై ఇప్పటివరకు 30 ఇన్నింగ్స్‌లు ఆడినా భారత సారథి ఆ మార్కును చేరుకోలేకపోయాడు. ఈ క్రమంలోనే గత ఆరు టెస్టుల్లో 4, 74, 14, 3, 19, 2 సాధించిన పరుగులు ఇవి. దీంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. అయితే, కోహ్లీ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో పలుమార్లు సెంచరీకి చేరువైనా దురదృష్టవశాత్తూ దాన్ని అందుకోలేకపోయాడు. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో శతకం సాధించేలా కనిపించినా రహానెతో సమన్వయలోపంతో రనౌటయ్యాడు. దాంతో 2020 ఏడాదిలో ఒక్క శతకం కూడా సాధించలేకపోయాడు.