టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మరోసారి తన పాత జ్ఞాపకాలు నెమరువేసుకున్నాడు. గురువారం ఫిరోజ్ షా కోట్లా మైదానంలో అతడి పేరుతో ఏర్పాటు చేసిన పెవిలియన్ ఆరంభోత్సవానికి... సతీమణి అనుష్కశర్మతో కలిసి హాజరయ్యాడు. ఈ కార్యక్రమానికి ఇతర భారత క్రికెటర్లు, సహాయక బృందం, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. వేదికపై మాట్లాడిన కోహ్లీ.. పలు ఆసక్తికర అంశాలు పంచుకున్నాడు.
"ఇంత పెద్ద స్థాయిలో నేను గౌరవం పొందుతానని అనుకోలేదు. ఇలాంటి సమయంలో ఏ విధంగా మాట్లాడాలో అర్థం కావట్లేదు. అది 2001.. జింబాబ్వే-భారత్ మ్యాచ్. ఆ ఆట చూడమని నా చిన్ననాటి కోచ్ రాజ్‌కుమార్ శర్మ నాకు రెండు టికెట్లు ఇచ్చారు. మ్యాచ్ ముగిశాక టీమిండియా క్రికెటర్ జవగల్ శ్రీనాథ్ ఆటోగ్రాఫ్ కోసం నేను, నా సోదరుడు పెవిలియన్ కిటికీ గ్రిల్స్‌లోంచి చాలా ప్రయత్నించాం. ఆ విషయం ఇప్పటికీ గుర్తుంది. కాని ఈ రోజు అదే ప్రఖ్యాత స్టేడియంలోని ఓ పెవిలియన్‌కు నా పేరు పెట్టడం నిజంగా నమ్మలేకపోతున్నా. ఇది నాకు దక్కిన గొప్ప గౌరవం". -విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
వేడుకలో దివంగత కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ గురించి తలచుకున్నాడు కోహ్లీ. ఆయనతో ఉన్న అనుబంధం గురించి చెప్పాడు.
" జైట్లీ గురించి ప్రపంచానికి వేరేలా తెలుసు కాని నాకు మాత్రం ఆయనొక గొప్ప మనవతావాది. నా తండ్రి చనిపోయినప్పుడు, బాధలో ఉంటే ఓదార్చి ధైర్యం చెప్పారు". --విరాట్ కోహ్లీ, భారత జట్టు కెప్టెన్
తండ్రి చనిపోయి బాధలో ఉన్నప్పుడూ, కోహ్లీ క్రికెట్‌ను వీడలేదని గుర్తుచేసుకున్నారు దిల్లీ క్రికెట్ సంఘం అధ్యక్షుడు రజత్ శర్మ. విరాట్ గొప్ప ఆటగాడు అవుతాడని జైట్లీ చెప్పేవారని.. ఆ మాటలు ఇప్పుడు నిజమయ్యాయని చెప్పారు. ఆ సమయంలో కోహ్లీ భార్య అనుష్కశర్మ కన్నీటిపర్యంతమైంది. తర్వాత కోహ్లీ చేతిని తీసుకొని ముద్దాడింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.