ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం చాలా ఆత్రుతగా ఎదురు చూస్తున్నట్లు చెప్పాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ఈ మధ్య కాలంలో 5 రోజుల ఆటల్లో పోటీ రెండింతలైందని అభిప్రాయపడ్డాడు.
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌పై ప్రేమతో కోహ్లీ - ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్
టెస్టు క్రికెట్‌లో పోటీ గతంతో పోలిస్తే రెట్టింపు అయిందని అభిప్రాయపడ్డాడు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ. టెస్టు ఛాంపియన్‌షిప్ ఆడేందుకు ఆత్రుతగా ఎదురు చూస్తున్నానని వెల్లడించాడు. ఆంటిగ్వా వేదికగా ఈ నెల 22 నుంచి వెస్టిండీస్‌తో 5 రోజుల ఆటలకు సిద్ధమవుతోంది కోహ్లీసేన.
" ప్రస్తుతం క్రికెట్‌లో విపరీతమైన పోటీ ఉంది. అయితే టెస్టు క్రికెట్ కథ ముగిసినట్లేనని కొందరు అనుకుంటున్నారు. ఇలాంటి సమయంలో ప్రపంచ ఛాంపియన్‌షిప్ తీసుకురావడం సరైన నిర్ణయంగా భావిస్తున్నా. నా దృష్టిలో రెండేళ్లుగా టెస్టు క్రికెట్‌లో పోటీ రెట్టింపు అయింది. ఇప్పటి నుంచి మ్యాచ్‌లు డ్రా అయినా ఉత్కంఠగా ఉంటాయి. 5 రోజుల ఆట కూడా వాడీవేడిగా జరుగుతుంది. ఎందుకంటే అన్ని జట్లు అదనపు పాయింట్లు సాధించాలనే బరిలోకి దిగుతాయి".
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
వెస్టిండీస్ మ్యాచ్‌తో భారత జట్టు టెస్టు ఛాంపియన్‌షిప్‌ను ఆరంభిస్తోంది. ఆంటిగ్వాలో గురువారం తొలి మ్యాచ్ మొదలవుతోంది. సొంతమైదానం కావడం వల్ల కరీబియన్ ఆటగాళ్లు పుంజుకొనే అవకాశం ఉంటుందని కోహ్లీ అన్నాడు. ప్రత్యర్థుల బౌలింగ్ స్థాయికి తగినట్టు ఆడాల్సిన బాధ్యత బ్యాట్స్‌మెన్‌పై ఉందని అభిప్రాయపడ్డాడు.