దక్షిణాఫ్రికాతో తొలి టెస్టుకు ముందు మీడియాతో మాట్లాడిన కెప్టెన్ కోహ్లీ... టెస్టు క్రికెట్‌లో రోహిత్‌శర్మ ఓపెనింగ్‌పై స్పందించాడు. రోహిత్ తన శైలికి తగ్గట్లు బ్యాటింగ్ చేస్తే జట్టు ప్రదర్శన మారిపోతుందని అభిప్రాయపడ్డాడు కోహ్లీ.
"రోహిత్‌ను ఇప్పటికిప్పుడే అదరగొట్టేయాలని జట్టు కోరుకోవట్లేదు. భారత్‌లో ఆడేటప్పుడు ఒక ప్రణాళిక, విదేశాల్లో మరో ప్రణాళిక ఉంది. ఓపెనర్‌గా వచ్చే బ్యాట్స్‌మన్‌కు అతడి ఆటపై అవగాహన పెంచుకునే వరకు సమయమివ్వాలి. అందుకే రోహిత్ నుంచి అత్యద్భుత బ్యాటింగ్ ఆశించడం లేదు. అతడే స్వతాహగా తన అత్యుత్తమ ఆటను కనుగొనాలి. అప్పుడు జట్టు ప్రదర్శనే మారిపోతుంది".
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
హిట్‌మ్యాన్‌ను మాజీ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్‌తో పోల్చాడు కోహ్లీ. దూకుడుగా ఆడి మ్యాచ్‌ను ముందుకు తీసుకెళ్లడమే రోహిత్ బలమని... గతంలో వీరూ భాయ్ ఎన్నో ఏళ్లు టీమిండియాకు ఇదే పనిచేశాడని గుర్తు చేశాడు కోహ్లీ.
ఐపీఎల్ సమయంలో రోహిత్, సెహ్వాగ్
" ఎవరో చెబితే సెహ్వాగ్ దూకుడుగా ఆడి శతకాలు బాదలేదు. అది అతడి సహజసిద్ధమైన బ్యాటింగ్. రోహిత్‌కు అలా ఆడే సామర్థ్యముంది. పరిస్థితులను బాగా అంచనా వేయగలడు. రోహిత్‌ను ఎప్పటినుంచో టెస్టుల్లో ఓపెనర్‌గా తీసుకురావాలని భావించినా కుదరలేదు. ప్రస్తుతం పుజారా ఫామ్ కోల్పోవడం వల్ల ఇప్పుడు అవకాశమొచ్చింది".
-- విరాట్ కోహ్లీ, టీమిండియా సారథి
హిట్‌మ్యాన్ ఇదివరకు వన్డేల్లో మిడిలార్డర్ బ్యాట్స్‌మన్‌గా ఆడేవాడని చెప్పిన కోహ్లీ... అతడిని ఓపెనర్‌గా దించాలనే చర్చ వచ్చాక 8 నెలల్లో ఓపెనర్‌గా మారాడని తెలిపాడు. రోహిత్ పరిమిత ఓవర్ల క్రికెట్‌లో చెలరేగినట్లే టెస్టుల్లో రాణిస్తే, అది జట్టుకెంతో మంచిదన్నాడు విరాట్.
ప్రస్తుతం ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ కొనసాగుతున్నందున... హిట్‌మ్యాన్ తనకు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాడని ఆశిస్తున్నట్లు కోహ్లీ తెలిపాడు. మిగతా క్రికెటర్లు మయాంక్ అగర్వాల్, కేఎల్ రాహుల్, మురళీ విజయ్ లాంటి వాళ్లకూ.. ప్రతిభ ఆధారంగా సరైన సమయంలో ఛాన్స్‌లు ఇస్తామని అన్నాడు.