కేరళలో హృదయవిదారక పరిస్థితుల్లో ఏనుగు మృతిచెందిన ఉదంతంపై సోషల్‌మీడియాలో టీమ్ఇండియా క్రికెటర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఏ జంతువు కూడా అలాంటి క్రూరమైన హింసకు బలికాకూడదని అభిప్రాయపడ్డారు. బుధవారం సామాజిక మాధ్యమాల్లో ఈ వార్త వైరల్‌గా మారడం వల్ల దేశవ్యాప్తంగా చాలా మంది తల్లడిల్లిపోయారు. ఈ నేపథ్యంలోనే విషయం తెలుసుకున్న పలువురు భారత క్రికెటర్లు స్పందించారు.
"కేరళలో జరిగిన విషయం తెలిసి ఆందోళన చెందా. జంతువులపై ప్రేమను చూపండి. ఇలాంటి హేయమైన చర్యలకు ముగింపు పలకాలి".
- విరాట్ కోహ్లీ, టీమ్ఇండియా కెప్టెన్
"మనం క్రూరులం. ఎలా ఉండాలో ఇంకా నేర్చుకోవట్లేదా? కేరళలో ఆ ఏనుగుకు ఏం జరిగిందో తెలిసి హృదయం బరువెక్కింది. ఏ జంతువు కూడా అలాంటి క్రూరత్వానికి బలికాకూడదు".
-రోహిత్ శర్మ, టీమ్ఇండియా వైస్ కెప్టెన్
"దుర్మార్గులైన మనుషులు చేసిన మరో సిగ్గుమాలిన చర్య. జంతువుల పట్ల ప్రేమగా ఉంటే మానవులకు వచ్చే నష్టం ఏమీ లేదు. ఆ ఏనుగుకు పేలుడు పదార్థాలతో కూడిన పైనాపిల్‌ను పెట్టిన వ్యక్తులపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలి".
-సురేశ్ రైనా, టీమ్ఇండియా క్రికెటర్