భారత్, ఆస్ట్రేలియా మూడో టీ20లో ఒక విచిత్రం జరిగింది! బహుశా అంతర్జాతీయ క్రికెట్లో ఇలా జరగడం ఇదే తొలిసారి కావొచ్చు. టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ కోరిన సమీక్షను అంపైర్లు తిరస్కరించారు. టీవీ తెరపై రిప్లే వచ్చాక కోరాడని బ్యాట్స్‌మన్ ఫిర్యాదు చేయడమే ఇందుకు కారణం.
ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ 11 ఓవర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఓవర్‌ను యువ పేసర్ నటరాజన్ విసిరాడు. నాలుగో బంతిని మాథ్యూ వేడ్ ఆడాడు. లెగ్‌స్టంప్ మీదుగా వచ్చి హాఫ్ వాలీని వేడ్ ఆడలేకపోయాడు. దాంతో బంతి నేరుగా ప్యాడ్లకు తగిలింది. బంతి విసిరిన నట్టూ.. బౌలర్ అప్పీల్ చేయలేదు. కీపర్ రాహుల్ సమీక్షను పట్టించుకోలేదు. డీప్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లీ సమీక్ష కోరాడు. అంపైర్లు అంగీకరించి థర్డ్ అంపైర్‌కు నివేదించగా ఆయన అంగీకరించలేదు. దాంతో గందరగోళానికి గురైన విరాట్ పరుగెత్తుకుంటూ మైదానంలోని ఫీల్డర్ల వద్దకు వచ్చాడు.
ఇంతకీ ఏమైందంటే.. విరాట్ సమీక్ష కోరేలోపే మైదానంలోని భారీ తెరపై ఆ బంతికి సంబంధించిన రీప్లేను ప్రదర్శించారు. అందులో బంతి వికెట్లను తగులుతున్నట్టు తేలింది. దాంతో తెరపై వచ్చాక సమీక్ష కోరారని మాథ్యూవేడ్ ఫిర్యాదు చేయడం వల్ల రివ్యూను అంపైర్లు తిరస్కరించారు. అయితే విరాట్ నిర్దేశిత సమయంలోనే సమీక్ష కోరాడా? రీప్లే ముందుగానే ప్రదర్శించారా? అనే విషయాల్లో స్పష్టత రావాల్సి ఉంది.