క్రికెట్‌పై వీరాభిమానమున్న భారత్‌లో అంచనాలు అధికంగా ఉంటాయని.. అలాంటి పరిస్థితుల్లోనూ విరాట్ కోహ్లీ జట్టుకు నాయకత్వం వహించడం అసాధారణమైన విషయమని ఆస్ట్రేలియా పరిమిత ఓవర్ల కెప్టెన్ ఆరోన్ ఫించ్ అన్నాడు. భారత్ తరఫున ఆడే సమయంలో ఉండే ఒత్తిడి ఒకెత్తు అయితే.. సారథిగా వ్యవహరిస్తూ కోహ్లీ స్థిరంగా నడుచుకునే తీరు అద్భుతమని వివరించాడు.
ప్రతి ఆటగాడు కొన్ని చేదు అనుభవాలు ఎదుర్కొంటాడని.. అయితే కోహ్లీ, స్టీవ్ స్మిత్, రికీ పాంటింగ్, క్రికెట్ దిగ్గజం సచిన్ తెందుల్కర్ వంటి ఆటగాళ్లు ఇందుకు మినహాయింపు అని ఫించ్ పేర్కొన్నాడు.
ఎంఎస్ ధోనీ తర్వాత టీమ్ఇండియాకు సారథిగా వహించడమంటే చాలా పెద్ద విషయం. అంచనాలు కూడా ఎక్కువగా ఉంటాయి. కానీ కోహ్లీ ఎక్కడా తగ్గలేదు. అది నిజంగా ఆకట్టుకునే విషయం అని నా అభిప్రాయం. కోహ్లీ ఆడిన మూడు ఫార్మాట్లలో.. అతడి నిలకడ ఎంతగానో ఆకట్టుకుంది. వన్డే క్రికెట్లో ఆల్‌టైమ్ అత్యుత్తమ ఆటగాడిగా ఉండటం చాలా పెద్ద విషయం. అయితే టెస్టు, టీ20 టోర్నీల్లోనూ మంచి ప్రదర్శన కనబరచడం ఎంతో గొప్ప విషయం.