భారత క్రికెట్‌లో రోహిత్, కోహ్లీకి రికార్డులంటే లెక్కేలేదు. అలవోకగా రన్స్ చేస్తూ మ్యాచ్ స్వరూపాలను మార్చేస్తుంటారు. అయితే వీరిద్దరి మధ్య గతేడాది నుంచి ఓ రికార్డు దోబూచులాడుతోంది. ఫలితంగా టీ20ల్లో అత్యధిక పరుగులు వీరుడి స్థానం కోసం వీళ్లిద్దరూ పోటీపడుతూనే ఉన్నారు. గతేడాది టెస్టుల్లోనూ సమానమైన పరుగులు చేసిన వీళ్లు.. తాజాగా ఈ రికార్డు వేటలోనూ రేసులో ఉన్నారు. ప్రస్తుతం విరాట్ కోహ్లీ 2783 పరుగులతో అగ్రస్థానంలో ఉండగా.. రోహిత్ శర్మ 2713 రన్స్‌తో రెండో ర్యాంక్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ పర్యటనలో మరో రెండు టీ20లు బాకీ ఉన్నాయి. వీటిలో హిట్‌మ్యాన్ ఫామ్ నిరూపిస్తే ఈ రికార్డు మళ్లీ మారే అవకాశముంది.
మహీని దాటేశాడు..
టీమిండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీని ఇటీవలే అధిగమించాడు ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీ. న్యూజిలాండ్‌తో జరిగిన మూడో టీ20లో సారథిగా విరాట్ మరో అరుదైన రికార్డును అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు సాధించిన సారథిగా... కింగ్ కోహ్లీ మూడో స్థానానికి ఎగబాకాడు. ఈ మ్యాచ్‌లో ఇష్ సోథి వేసిన ఇన్నింగ్స్ 16వ ఓవర్ నాలుగో బంతిని సింగిల్ సాధించి ఈ మైలురాయి అందుకున్నాడు విరాట్. ఈ క్రమంలో టీమిండియా తరఫున అత్యధిక పరుగులు సాధించిన మాజీ సారథి ఎంఎస్ ధోనీ(1112) రికార్డు బ్రేక్ అయింది. మొత్తంగా ఈ జాబితాలో దక్షిణాఫ్రికా సారథి డూప్లెసిస్(1273), కివీస్ కెప్టెన్ కేన్ విలియమ్సన్(1148) రన్స్‌తో తొలి రెండు స్థానాల్లో ఉన్నారు.