మైదానంలో విభిన్నరీతిలో ఎక్స్ప్రెషన్స్ పెడుతూ ఆశ్చర్యపరుస్తుంటాడు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ను ఔట్ చేసినప్పుడు.. ధోనీ సిక్సర్ బాదినప్పుడు వైవిధ్యమైన హావభావాలు ప్రదర్శించడం చూశాం. తాజాగా శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో శ్రేయస్ కొట్టిన సిక్సర్‌కు అదే విధంగా స్పందించాడు విరాట్. అయితే ఈ సారి శ్రేయస్ కూడా కోహ్లీని అనుసరించాడు.
ఇండోర్ మ్యాచులో శ్రీలంక బౌలర్ వనిందు హసరంగ 16వ ఓవర్ బౌలింగ్ చేశాడు. ఫుల్లర్ లెంగ్త్‌గా సంధించిన ఆఖరి బంతిని.. చక్కని టైమింగ్‌తో శ్రేయస్ కళ్లు చెదిరే భారీ సిక్సర్(101 మీటర్లు) బాదేశాడు. లాంగాన్ మీదుగా మూడు అంతస్తుల ఎత్తులోంచి అది బౌండరీ దాటింది. ఆ షాట్‌ను చూసి కోహ్లీ ఓహ్.. ఉఫ్! అన్నట్టు తన భావాన్ని వ్యక్తీకరించాడు.