భారత్, బంగ్లాదేశ్ జట్ల మధ్య ఈనెల 22 నుంచి 26 వరకు తొలి డే/నైట్ టెస్టు జరగనుంది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా తొలిసారి పింక్ బాల్ మ్యాచ్ ఆడనుంది కోహ్లీసేన. అయితే ఫ్లడ్‌లైట్ల వెలుగులో మ్యాచ్ ఆడాల్సి ఉంటుంది కాబట్టి వాతావరణానికి అలవాటు పడటానికి మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్(ఎంపీసీఏ) సాయం కోరింది టీమిండియా. ఇండోర్ స్టేడియంలో ఫ్లడ్‌లైట్ల కింద ఆటగాళ్లు ప్రాక్టీస్ చేయడానికి సహకరించాలని యాజమాన్యం అడగ్గా.. అందుకు మద్దతు తెలిపింది ఎంపీసీఏ.
" టీమిండియా గులాబి బంతితో ప్రాక్టీస్ చేయడానికి మమ్మల్ని సంప్రదించింది. అందుకు మేం సంతోషంగా ఒప్పుకున్నాం. వారికి తగిన ఏర్పాట్లు చేశాం".
- మిలింద్ కన్మాడికర్, ఎంపీసీఏ మాజీ సెక్రటరి
ఇదే విషయంపై టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె మాట్లాడుతూ.. " ఇదొక కొత్త ఛాలెంజ్. ఈ మ్యాచ్ ఆడేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఇదెలా జరుగుతుందో నాకు తెలీదు. కొన్ని సెషన్లు ప్రాక్టీస్ చేస్తే కొంత అవగాహన వస్తుంది. అప్పుడే పింక్‌బాల్ ఆటపై ఒక అంచనాకు రాగలుగుతాం. కొత్త పద్ధతిని అలవాటు చేసుకోవడం ఇబ్బందిగా భావించకూడదు " అని తెలిపాడు.