నూతన ఏడాదిలో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ తన రికార్డుల వేట ప్రారంభించాడు. శ్రీలంకతో జరిగిన రెండో టీ20లో ఒక్క పరుగు వ్యక్తిగత స్కోరు వద్ద... అరుదైన ఘనత అందుకున్నాడు. టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా కోహ్లీ అగ్రస్థానం కైవసం చేసుకున్నాడు.
ఈ మ్యాచ్ ముందు వరకు టీమిండియా పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ, కోహ్లీ.. పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక పరుగుల జాబితాలో అగ్రస్థానంలో కొనసాగారు. ఈ మ్యాచ్‌లో దాన్ని బ్రేక్ చేశాడు విరాట్. హిట్‌మ్యాన్ 104 టీ20ల్లో 2,633 పరుగులు సాధిస్తే విరాట్ 75 మ్యాచుల్లోనే అన్నే పరుగులు చేశాడు.
సారథిగా రికార్డు
టీ20ల్లో అత్యధిక స్కోరు సాధించిన సారథిగా రికార్డు సృష్టించాడు విరాట్ కోహ్లీ. ఈ మ్యాచ్‌లో 17 బంతుల్లో 30 పరుగులు చేసిన కోహ్లీ... వేయి పరుగుల మైలురాయిని అందుకున్నాడు. తక్కువ ఇన్నింగ్స్‌ల్లో ఈ ఘనత సాధించిన సారథిగానూ పేరు తెచ్చుకున్నాడు. విరాట్ 30 ఇన్నింగ్స్‌లోనే ఈ ఘనత సాధించాడు. తర్వాత స్థానాల్లో డుప్లెసిస్(31), కేన్ విలియమ్సన్(36) ఉన్నారు.
ఇండోర్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో భారత్ ఘన విజయాన్ని నమోదు చేసింది. 143 పరుగుల లక్ష్యాన్ని17.3 ఓవర్లలోనే ఛేదించింది. మూడో టీ20 పుణె వేదికగా ఈనెల 10న జరగనుంది.