టీమ్‌ఇండియా సారథి విరాట్ కోహ్లీ, బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్కశర్మ ఒకరితో ఒకరు పోటీపడ్డారు. ఒకరి గురించి మరొకరికి ఎంత తెలుసో? ఇద్దరిలో ఎవరు బెటరో? తెలుసుకుందామని ప్రయత్నించారు. 'టేక్ ఏ బ్రేక్' పేరుతో మూడు రౌండ్లు పెట్టుకున్న ఈ పోటీలో తమ వృత్తులు, ఇష్టాఇష్టాల గురించి ప్రశ్నలు సంధించుకున్నారు. అయితే వాటి ద్వారా కొన్ని సరదా సంగతులూ బయటపడ్డాయి. అవేంటంటే..!
విరుష్క జోడి గొడవ పడితే.. మొదట క్షమాపణ చెప్పేదెవరు? - virat TakeABreak session
ఐదు నెలలకు పైగా క్రికెట్ మ్యాచ్లు లేకపోవడం వల్ల ఇంటికే పరిమితమయ్యాడు భారత క్రికెట్ జట్టు సారథి విరాట్ కోహ్లీ. తన భార్య అనుష్క శర్మతో ఈ విలువైన సమయాన్ని ఆశ్వాదిస్తున్నాడు. అయితే వీలుచిక్కినప్పుడల్లా సామాజిక మాధ్యమాల్లో అభిమానులను పలకరించే విరాట్.. తాజాగా అనుష్కతో కలిసి నెటిజన్లను పలకరించాడు.
తొలిరౌండ్లో తమ వృత్తుల గురించి ప్రశ్నించుకున్నారు. భారత్‌లో నిర్మించిన తొలి హిందీ ఫీచర్ ఫిల్మ్ ఏదని అనుష్క ప్రశ్నించగా విరాట్ నోరెళ్లబెట్టాడు. ఏదో ప్రయత్నించి 'మేరా అంజాన్' అని చెప్పాడు. అయితే 'రాజా హరిశ్చంద్ర' (1913) సరైన సమాధానమని అనుష్క చెప్పింది. ఆ తర్వాత క్రికెట్ నేపథ్యంలో వచ్చిన రెండు సినిమాల పేర్లు అడగ్గానే 'లగాన్', 'పటియాలా హౌజ్' అని ఠక్కున చెప్పేశాడు విరాట్. అయితే క్రికెట్‌లో మూడు ప్రాథమిక నిబంధనలు అడగ్గా.. 'ఔటవ్వొద్దు', 'ఆటను వదిలేయొద్దు' అని అనుష్క నవ్వుతూ బదులిచ్చింది. ఆ తర్వాత సరైన సమాధానాలు చెప్పింది. మహిళల క్రికెట్లో ఎక్కువ వికెట్లు తీసిన బౌలర్ ఎవరని అడగ్గా.. 'జులన్ గోస్వామి' అని ఠక్కున చెప్పేసింది.
ఇక వ్యక్తిగతానికి వస్తే ఒకరినొకరు సంతోషంగా ఉంచడానికి ఏం చేస్తారు? ఫలానా తేదీన ఎక్కడికి వెళ్లాం? వంటి ప్రశ్నలు అడిగారు. 'నన్ను ఎవరు సంతోషంగా ఉంచుతారు?' అని అనుష్క అడగ్గా 'మూగజీవులు' అని కోహ్లీ చెప్పాడు. అయితే 'నువ్వు కదా నన్ను సంతోషంగా ఉంచేది' అని ఆమె అనగా అవును కదా! అని విరాట్ అన్నాడు. ఇక సినిమాలకు వెళ్తే ఎవరు నిద్రపోతారు? అంటే తానేనని కోహ్లీ చెప్పాడు. ఇద్దరూ గొడపడితే ముందుగా తానే క్షమాపణ చెబుతానని, ఇద్దరూ పోట్లాడుకుంటే 'కోహ్లీ' ఘోరంగా ఓడిపోతాడని అనుష్క చెప్పింది. ప్రస్తుతం ఈ వీడియో వైరల్‌గా మారింది.