ఈ ఏడాది కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) సెప్టెంబరు నుంచి ఆరంభం కానుంది. గతేడాది బార్బడోస్ జట్టు ఆటగాళ్లకు మాల్యా చెల్లింపులు చేయకపోవడం వల్ల... యాజమాన్యాన్ని మార్చేస్తూ నిర్ణయం తీసుకోనున్నారు నిర్వాహకులు. ఇప్పటికే కొనుగోలుదారులతో చర్చలు జరపుతున్నారు. అన్నీ అనుకున్నట్లు జరిగితే మే 22న ఆటగాళ్ల జాబితా, కొత్త యాజమాన్యాన్ని అధికారికంగా ప్రకటించనున్నారు.
ఏంటి కారణం...??
ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు మాజీ యజమాని విజయ్‌మాల్యా బ్యాంకు రుణ ఎగవేత కేసులో నిందితుడు. భారత్ నుంచి పారిపోయి బ్రిటన్‌లో ఉంటున్నారు. ఆయన ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయకుండా ఆంక్షలు విధించింది భారత్. ఫలితంగా 2018 లీగ్ సెప్టెంబరులోనే ముగిసినా ఆటగాళ్ల జీతభత్యాల చెల్లింపులు జరగలేదు. మాల్యా నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం వల్ల యాజమాన్యం హోదాను రద్దు చేసేందుకు... సమాలోచనలు జరుపుతున్నట్లు లీగ్ సీఈఓ డమిన్ ఓ డొనొహో వెల్లడించారు.
'ఈ చెల్లింపుల అంశం పెద్ద తలనొప్పిగా మారింది. బార్బడోస్ సమస్య రెండు లేదా మూడు వారాల్లో తీరిపోతుంది. ఈ జట్టుకు కొత్త యాజమాన్యాన్ని త్వరలో ప్రకటించేందుకు ప్రయత్నిస్తున్నాం.'
--డమిన్ ఓ డొనొహో, సీపీఎల్ సీఈఓ
ట్రిడెంట్స్ జట్టు ఆటగాడు డ్వేన్ స్మిత్ ఇటీవల సీపీఎల్పై విమర్శలు గుప్పించాడు. జీతాలు చెల్లించలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్పందించిన సీపీఎల్ నిర్వాహకులు... సమస్యను త్వరలో పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఇదొక గుణపాఠమని మళ్లీ ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకుంటామని ఆటగాళ్లకు హామీనిచ్చారు. ఈ ఏడాది సీపీఎల్ లీగ్ మ్యాచ్‌లు సెప్టెంబరు 4 నుంచి అక్టోబర్ 12 వరకు జరగనున్నాయి.
సెప్టెంబరు 4 నుంచి లీగ్ ప్రారంభం