విజయ్ హజారే ట్రోఫీ తొలి రోజే పలువురు దేశవాళీ బ్యాట్స్మెన్లు రెచ్చిపోయారు. రానున్న ఐపీఎల్‌తో పాటు, ఇంగ్లాండ్‌తో జరగనున్న పరిమిత ఓవర్ల సిరీస్‌లలో అవకాశాలే లక్ష్యంగా శతకాలు బాదారు. మధ్యప్రదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఝార్ఖండ్ కెప్టెన్ ఇషాన్ కిషన్ భారీ సెంచరీతో అదరగొట్టాడు. ఫలితంగా 324 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఝార్ఖండ్ టీమ్.
దంచికొట్టిన ఇషాన్..
తొలుత బ్యాటింగ్‌కు దిగిన కిషన్ సేన.. నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 422 పరుగులు చేసింది. కెప్టెన్ ఇషాన్ కేవలం 94 బంతుల్లోనే 173 రన్స్ చేసి.. జట్టు భారీ స్కోరుకు బీజం వేశాడు. ఇందులో 142 పరుగులు బౌండరీల ద్వారా వచ్చినవే కావడం విశేషం. అతనికి తోడు విరాట్ సింగ్, సుమిత్ కుమార్, అనుకుల్ రాయ్‌లు అర్ధ సెంచరీలతో సత్తా చాటారు.
అనంతరం 423 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన మధ్యప్రదేశ్ జట్టు కేవలం 98 స్కోరుకే ఆలౌటైంది. ఫలితంగా.. 324 పరుగుల తేడాతో గెలిచింది ఝార్ఖండ్. 42 పరుగులు చేసిన అభిషేక్ భండారి ఆ జట్టు టాప్ స్కోరర్. ముగ్గురు బ్యాట్స్మెన్లు డకౌట్ అయ్యారు. మిగతా వారు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఝార్ఖండ్ బౌలర్ వరుణ్ ఆరోన్ 6 వికెట్లతో కీలక ప్రదర్శన చేశాడు.
సంక్షిప్త స్కోర్లు:
ఝార్ఖండ్:422/9, 50 ఓవర్లు. (ఇషాన్ కిషన్ 173, అనుకుల్ రాయ్ 72, గౌరవ్ యాదవ్ 4/73)
మధ్యప్రదేశ్: 98 ఆలౌట్, 18.4 ఓవర్లు. (అభిషేక్ భండారి 42, వెంకటేష్ అయ్యర్ 23, వరుణ్ ఆరోన్ 6/37, బాల్ క్రిష్ణ 2/8)
త్రిపురతో జరిగిన మరో మ్యాచ్‌లో హైదరాబాద్ టీమ్ విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్.. నిర్ణీత ఓవర్లలో 349 పరుగులు చేసింది. ఓపెనర్లు తన్మయ్ అగర్వాల్, తిలక్ వర్మలు మొదటి వికెట్‌కు 166 పరుగుల భాగస్వామ్యం నమోదు చేశారు. తిలక్ వర్మ సెంచరీకు తోడు తన్మయ్ అగర్వాల్, హిమాలయ అగర్వాల్, భావనాక సందీప్‌లు మెరిశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన త్రిపుర జట్టు 236 పరుగులకు ఆలౌటైంది. బిక్రమ్‌కుమార్ దాస్, మిలింద్ కుమార్‌లు హాఫ్ సెంచరీలు చేసినప్పటికీ నిరాశ తప్పలేదు. 5 వికెట్లతో అద్భుత ప్రదర్శన చేసిన చామ మిలింద్ జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.