ఆదివారం జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ తుది పోరుకు ముంబయి, ఉత్తర్‌ప్రదేశ్ జట్లు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే మూడు సార్లు ట్రోఫీ గెలిచిన ముంబయి జట్టు ఈ ఏడాది కూడా కప్ దక్కించుకుని నాలుగో విజయం తమ ఖాతాలో వేసుకునేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు.. ప్రత్యర్థికి గట్టి పోటీ ఇచ్చి ట్రోఫీ సొంతం చేసుకోవాలని ఉత్తర్‌ప్రదేశ్ జట్టు సన్నాహాలు చేస్తోంది. దిల్లీలోని అరుణ్‌జైట్లీ మైదానంలో ఉదయం 9 గంటలకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
పృథ్వీ షా...
ఈ టోర్నీలో ముంబయి జట్టు సారథి పృథ్వీ షా రికార్డు ఇన్నింగ్స్‌లు ఆడి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మొత్తంగా 754 పరుగులు చేశాడు. మూడు ఇన్నింగ్స్‌ల్లో 105, 227,185 పరుగులు చేసిన నాటౌట్‌గా నిలిచాడు. ఇదేకాక.. యశస్వి జైశ్వాల్, సర్ఫరాజ్ ఖాన్, వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ ఆదిత్య తారే, ఆల్‌రౌండర్స్ శివమ్ దుబే, షామ్స్ ములానీలతో జట్టు పటిష్ఠంగా కనిపిస్తోంది.
14 వికెట్లు తీసిన పేసర్ ధవాల్ కులకర్ణి, స్పిన్ త్రయం ప్రశాంత్ సోలంకి, తనూష్ కోటియన్, షామ్స్ ములానితో బౌలర్ల పరంగానూ ముంబయి జట్టు సత్తా చాటేలా కనిపిస్తోంది.