ప్రస్తుతం టీమ్ఇండియాకు మంచి ఫినిషర్ అవసరమని, ఆ స్థానాన్ని భర్తీ చేసి ప్రపంచకప్‌నకు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తానని భారత సీనియర్ బ్యాట్స్‌మన్ రాబిన్ ఉతప్ప ఆశాభావం వ్యక్తం చేశాడు. 34 ఏళ్ల ఉతప్ప భారత జట్టు తరఫున చివరగా 2015లో జింబాబ్వేతో టీ20 ఆడాడు. 2011 నుంచి కేవలం 8 వన్డేలు, నాలుగు టీ20లు మాత్రమే ఆడాడు. 2007 వన్డే ప్రపంచకప్‌తో పాటు అదే ఏడాది జరిగిన టీ20 ప్రపంచకప్ జట్టులోనూ ఉన్నాడు. అయితే ఓపెనర్‌గానే కాకుండా మిడిలార్డర్‌లోనూ సత్తా చాటగలనని ఉతప్ప అంటున్నాడు.
"నాలో కసి ఇంకా అలానే ఉంది. తప్పకుండా సత్తా చాటగలను. పొట్టి ఫార్మాట్‌లో భారత్ తరఫున ప్రపంచకప్‌నకు మరోసారి ప్రాతినిధ్యం వహిస్తానన్న నమ్మకం ఉంది. అయితే దానికి అదృష్టం, దేవుడి ఆశీర్వాదం ఉండాలి. భారత్‌లో ఇది ఎంతో ముఖ్యం. ఇతర దేశాల్లో అయితే పెద్దగా అవసరం లేదు. అంతేకాక మనపై మనం విశ్వాసం ఉంచుకోవాలి. సానుకూల ధోరణితో ఉండాలి. సామర్థ్యం ఉందని భావించాలి."